Kumaram Bheem Asifabad: పశువులకేదీ బీమా?
ABN , Publish Date - Nov 16 , 2024 | 10:02 PM
బెజ్జూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమంతోపాటు పాడిపరిశ్రమ అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి.
- ఆరేళ్లుగా నిలిచిన బీమా పథకం
- నష్టపోతున్న పశు పోషకులు
- పట్టించుకోని అధికారులు
బెజ్జూరు, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమంతోపాటు పాడిపరిశ్రమ అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తామన్న ప్రభుత్వ మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి. పాడిపరిశ్రమను ఆధారంగా చేసుకొని ఎన్నో కుటుంబాలు జీవిస్తున్నా పాడి పశువుల సంరక్షణపై మాత్రం ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. ముఖ్యంగా లక్షలాది రూపాయలు పెట్టి పశువులను కొనుగోలు చేస్తున్నప్పటికీ వాటికి బీమా సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. జిల్లాలో బీమా అమలు కాకపోవడంతో పశుపోషకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లాలో వ్యవసాయం తరువాత రైతులు ఎక్కువగా పాడిపరిశ్రమపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటును అందించే వ్యవసాయ అనుబంధరంగాలపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. రైతులు వ్యవసాయంతో పాటు పాడిపరిశ్రమను కొనసాగిస్తే ఆర్థికంగా ఆసరా ఉంటుంది. ప్రభుత్వం చేయూతను అందిస్తామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. ఆరేళ్లుగా పశువుల బీమా పథకం నిలిపివేయడంతో పశుపోషకులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. పాడిపశువులు అనారోగ్యం, ఇతర కారణాలతో మృత్యువాత పడుతుండటంతో వారు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఆరేళ్లుగా నిలిచిన బీమా సౌకర్యం..
పశుబీమా పథకాన్ని 2017,2018వరకు గత ప్రభుత్వం అమలు చేసింది. ఆరేళ్లుగా ఈ పథకాన్ని కేంద్ర, రాష్ఠ్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదు. గ్రామీణప్రాంతాల్లో పశువులు, రోడ్లు, విద్యుత్ ప్రమాదాలు, అనారోగ్యం కారణంగా చనిపోతున్నాయి. మేలు జాతి పశువులకు రూ.లక్షల్లో డిమాండ్ ఉంది. అనివార్య కారణాలతో పశువులు మృతిచెందితే రైతులు పూర్తిస్థాయిలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోతున్నారు. గతంలో బీమా కోసం యజమాని కొంత చెల్లిస్తే ప్రభుత్వం కొంత మొత్తం జమచేసేది. ఏదైనా ప్రమాదంలో జీవాలు చనిపోతే ఆయా సంస్థల నుంచి గతంలో పశువుల రకాన్ని బట్టి 50వేల రూపాయల వరకు పరిహారం అందేది. దీంతోపాటు పశువులు మృత్యువాత పడినా వచ్చిన బీమా డబ్బులతో రైతులు మళ్లీ పశువులను కొనుగోలు చేసుకొని భరోసాగా ఉండేవారు. ప్రస్తుతం ఈ పథకం నిలిచిపోవడంతో వివిధ కారణాలతో పశువులు చనిపోతే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు.
ఏటా జీవాల మృతి..
జిల్లావ్యాప్తంగా మొత్తం ఆవులు 2,93,845, గేదెలు 46,374, గొర్రెలు 1,59,349, మేకలు 2,56,854, పందులు 507, కుక్కలు 907, ఇతర జంతువులు ఉన్నాయి. ఏటా వందల కొద్దీ పశువులు అనారోగ్యం, పిడుగులు పడి, రోడ్డు, రైలు ప్రమాదాల కారణంగా మృతిచెందుతున్నాయి. పలుమార్లు లంపిస్కిన్ తదితర వ్యాధులు సోకి ఆవులు, ఎద్దులు మృత్యువాత పడుతున్నాయి. గత ప్రభుత్వం గొర్రెల పథకలో పంపిణీ చేసిన గొర్రెలకు మాత్రమే బీమా వర్తింపజేసేది. ప్రస్తుతం గొర్రెలు, ఎద్దులు, గేదెలకు బీమా సదుపాయం లేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ప్రైవేటు బీమా కంపెనీలను ఆశ్రయించి బీమా చేయించాలనుకుంటే సుమారు 50వేల రూపాయల పశువులకు 4వేలుఖర్చు అవుతుందని వాపోతున్నారు. ప్రభుత్వం పశుబీమా పథకాన్ని అమలుచేసి 50శాతం నిధులు కేటాయించి ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
బీమా పథకాన్ని పునరుద్దరించాలి..
- కావిడే బీంరావు, రైతు, చిన్నసిద్దాపూర్
జిల్లాలో పశువులకు బీమాపథకాన్ని పునరుద్దరించాలి. బీమా కోసం ప్రైవేటు కంపెనీలను ఆశ్రయిస్తే డబ్బులు అధికంగా ఖర్చవుతున్నాయి. ప్రైవేటుగా బీమా పథకాన్ని చేయించుకోకపోవడం వల్ల పశువులు మృత్యువాతపడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం రైతుల వాటా కలుపుకొని బీమా పథకాన్ని తిరిగి పునరుద్దరించాలి.
ప్రభుత్వానికి నివేదిస్తాం..
- డాక్టర్ సురేష్, జిల్లా పశువైద్యాధికారి, ఆసిఫాబాద్
ప్రభుత్వం పంపిణీ చేసిన పథకాల్లో లబ్ధిదారులు పొందిన పశువులకు యూనిట్ విలువ నుంచి బీమా సదుపాయం కల్పించింది. రైతుల వద్ద ఉన్న పశువులకు బీమా పథకం కల్పించలేదు. ప్రైవేటుగా బీమా చేసుకుంటే నష్టం జరిగినప్పుడు పరిహారం అందుతుంది. కొత్త ప్రభుత్వం బీమా పథకాన్ని అమలు చేస్తే పశువులకు బీమా సదుపాయం కల్పిస్తాం.