Share News

Kumaram Bheem Asifabad : కానరాని బస్‌ షెల్టర్లు

ABN , Publish Date - Nov 23 , 2024 | 10:39 PM

బెజ్జూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో బస్సుషెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Kumaram Bheem Asifabad : కానరాని బస్‌ షెల్టర్లు

- మండుటెండలో ప్రనయాణికుల పడిగాపులు

- రోడ్లపైనే బస్సెక్కడం.. దిగడం..

- తాగునీటికి దిక్కు లేదు

- తాత్కాలిక ఏర్పాట్లైనా చేయాలంటున్న ప్రజలు

బెజ్జూరు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు మండలాల్లో బస్సుషెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రకరకాల చార్జీల పేరుతో ప్రయాణికుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్న ఆర్టీసీ సౌకర్యాల కల్పనపై మాత్రం దృష్టిసారించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో పదిహేను మండలాలుండగా కేవలం ఆసాఫాబాద్‌, కాగజ్‌నగర్‌, కౌటాల మండలాల్లో మాత్రమే బస్టాండ్‌లు ఉన్నాయి. మిగితా మండలాల్లో కొన్నిచోట్ల కేవలం షెల్టర్లు మాత్రమే ఉన్నాయి. బెజ్జూరు, చింతలమానేపల్లి, సిర్పూర్‌(టి), దహెగాం, రెబ్బెన, కెరమెరి, తిర్యాణి వంటి మండలాల్లో బస్టాండ్‌లు లేవు. దీనితో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తిప్పలు పడుతున్నారు. పెంచికలపేటలో చిన్నషెల్టర్‌ మాత్రమే ఉంది. ప్రయాణికులకు నిలువ నీడలేకపోవడంతో ఎండలోనే నిలవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. బస్సులకోసం గంటల తరబడి రోడ్లపై, కిరాణ దుకాణాల ఎదుట, చెట్ల కింద వేచి చూడాల్సిన దుస్థితి ఉంది.

అధికారుల పట్టింపు కరువు..

మండలాల్లో నుంచి ప్రతినిత్యం వివిధ పనుల నిమిత్తం కాగజ్‌నగర్‌కు, జిల్లా కేంద్రానికి ప్రజలు రాకపోకలు చేస్తుంటారు. పెళ్లిళ్లు తదితర సందర్భాల్లో మహిళలు చంటి పిల్లలతో, కుటుంబసభ్యులు ఎండలోనే వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. గతంలో కొన్నిచోట్ల బస్టాండ్‌ల నిర్మాణం కోసం పాలకులు భూమిపూజ చేసినప్పటికీ ఇప్పటికీ పనులు ప్రారంభించలేదు. రోడ్లపై నిల్చుని ఉన్నా కనీసం తాగడానికి మంచినీరు సైతం దొరకని పరిస్థితి తలెత్తుతోంది. వర్షాకాలంలో వర్షాలకు తడుచుకుంటూ, ఎండాకాలంలో ఎండకు ఎండుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దుస్థితి మారదా..

ప్రయాణికులు అవస్థలు పడకుండా అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా ఆర్టీసీ ఆచరణలో మాత్రం అమలు చేయడం లేదని ప్రయాణికులు వాపోతున్నారు. ఆర్టీసీ ద్వారా ప్రభుత్వానికి కోట్ల ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనపై శ్రద్ధ చూపడం లేదని పేర్కొంటున్నారు. గతంలో ఆర్టీసీ బస్సు చార్జీలను సైతం పెంచినా వసతులుమాత్రం కల్పించడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికుల సౌకర్యార్థం వసతులు, బస్‌ షెల్టర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో మహిళలకు ఉచితప్రయాణం కల్పించడతో బస్సుల్లో రద్దీకూడా పెరిగింది. ఉచిత ప్రయాణం కావడంతో జిల్లాలోని ఆయామండలాల పరిధిలోని గ్రామాలనుంచి నిత్యం బస్సుల్లో రవాణా కూడా విపరీతంగా పెరిగింది. దీనికి తగ్గట్టుగా సౌకర్యాలు లేనికారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

హామీలే తప్ప ఆచరణ కరువు..

బెజ్జూరు మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని గతంలో పలుమార్లు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. ఆచరణలో అమలు చేసిన దాఖలాలు మాత్రం లేవు. గతంలో ఎంపీ, ఎమ్యేల్యేలు బస్టాండ్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పినా ఇప్పటికీ అమలుకు నోచుకోలేదు. దీంతో వివిధ గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కారణంగా విపరీతమైన రద్దీ పెరిగింది. దీంతో నిత్యం వివిధ మండలాల నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు నిలువ నీడలేక అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దుకాణాల ఎదుట నిల్చుంటున్నాం..

- బోగ సంతోష్‌, బెజ్జూరు

బస్టాండ్‌ లేదు. ఎండకు ప్రాణం పోతోంది. చెట్లకింద, దుకాణాల ఎదుట నిల్చొని కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నాం. మాలాంటి వారికోసం, చిన్న పిల్లల కోసమన్నా కనీసం కూర్చోడానికైనా ఏర్పాట్లు చేయాలి. తాగునీరు అందుబాటులో ఉంచాలి.

బస్టాండ్‌ నిర్మించాలి..

- రాపెల్లి సమ్మన్న, బెజ్జూరు

ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మండల కేంద్రాల్లో బస్టాండ్‌లు ఏర్పాటు చేయాలి. ఎండ వేడిమి కారణంగా బయట ఉండలేకపోతున్నాం. అధికారులు స్పందించి బస్టాండ్‌ నిర్మించాలి. వాటిలో తాగునీరు, బాత్‌రూంలు ఏర్పాటు చేయాలి.

Updated Date - Nov 23 , 2024 | 10:39 PM