Share News

Kumaram Bheem Asifabad : ప్రతి పనిలో వారే.. పట్టించుకునే వారు లేరే..

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:44 PM

వాంకిడి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామపరిపాలనలో పంచాయతీ కార్మికులు ఎంతో కీలకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు పల్లెల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు.

Kumaram Bheem Asifabad :  ప్రతి పనిలో వారే.. పట్టించుకునే వారు లేరే..

- అరకొర జీతాలతో కుటుంబ పోషణ

- దిక్కుతోచని స్థితిలో పంచాయతీ కార్మికులు

- ప్రస్తుత ప్రభుత్వమైనా ఆదుకోవాలని వేడుకోలు

వాంకిడి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): గ్రామపరిపాలనలో పంచాయతీ కార్మికులు ఎంతో కీలకం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వారు పల్లెల్లో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందిస్తారు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు కానీ పంచాయతీ కార్మికుల జీవితాల్లో మార్పు రావడంలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు వారిని పట్టించుకున్న దాఖలాలులేవు. నెలనెల వేతనాలు రాక అప్పులు చేసి జీవనం కొనసాగిస్తున్న పంచాయతీ కార్మికులు చాలీచాలని వేతనాలతో కాలం వెళ్లదిస్తున్నారు. నెలకు రూ.9500 జీతంతో ఏళ్లుగా పంచాయతీల్లో పనిచేస్తున్నా.. ఉద్యోగ భద్రత లేదని కొత్త ప్రభుత్వం తమను ఆదుకోవాలని కారోబార్లు, పంచాయతీ కార్మికులు కోరుతున్నారు.

జిల్లాలోని 15మండలాల పరిధిలోని 335 గ్రామపంచాయతీలో 1103మంది దాదాపు 20ఏళ్లకు పైగా కారోబార్లు, పంపు ఆపరేటర్లు, ఎలక్ట్రీషియన్లు, పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. ఆయా గ్రామాల్లో విద్యుత్‌ బల్బులు అమర్చుటకు, మంచినీరు విడుదల చేయడానికి, ఇంటిపన్ను వసూలు చేయడానికి, గ్రామంలో ఊడ్చడం, మురికికాలువలు శుభ్రపర్చడం, ఎక్కడైనా చెత్త, దుర్గంధం ఉన్నా జంతువు చనిపోయి కంపు కొడుతున్నా తీసివేసే పనులను వీరు చేస్తున్నారు. కానీ ఇందుకు సరిపడ వేతనం మాత్రం అందుకోవడంలేదు. గ్రామాల్లో పన్నులు, బిల్లులు వసూళ్ల ఆధారంగా నెలకు రూ.9500 వేతనంగా చెల్లిస్తున్నారు. ఈ వేతనాలు కూడా నెలనెలా కాకుండా మూడునెలలకు ఒకసారి ఇస్తుండడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోంది. ఎప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పిస్తుందన్న ఆశతోనే వీరంతా విధులు నిర్వహిస్తున్నారు. విధుల్లో ఒత్తిడితో పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత, కనీసవేతనాల కోసం ఏళ్లుగా ఉద్యమిస్తూనే ఉన్నారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ఏ అధికారి పర్యటనకు వచ్చినా, మరేచిన్న పనికైనా వీరు తప్పక ఉండాల్సిందే. పెరుగుతున్న నిత్యవసర ధరలకు అనుగుణంగా ఈ వేతనాలతో కుటుంబ పోషణ చేయడం ఎలాసాద్యపడుతుందని కార్మికులు వాపోతున్నారు. ఆశావర్కర్లకు, ఇతర శాఖల సిబ్బందికి వేతనాలు పెంచుతున్న ప్రభుత్వం తమ గురించి పట్టించుకోకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇరవై ఏళ్ల నుంచి పంచాయతీల్లో కార్మికులుగా పనిచేస్తున్న తమకు ఉద్యోగభద్రత కల్పించి వేతనాలు పెంచాలని కార్మికులు కోరుతున్నారు.

-హామీఇచ్చారు.. అమలు మరిచారు..

గత ఏడాది పంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా సమ్మెచేపట్టారు. ఉవ్వెత్తున సమ్మె కొనసాగడంతో పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. అప్పటి ప్రభుత్వం దశలవారీగా కార్మిక సంఘాల నేతలు, కార్మికులతో చర్చలు జరిపి కొన్ని సమస్యలకు పరిష్కారం చూపింది. కార్మికుడు చనిపోయిన తర్వాత దహన సంస్కారాలకు రూ.10వేల నగదును పంచాయతీ నుంచి ఇవ్వాలని, రూ.5లక్షల బీమా వర్తించేలా చర్యలు తీసుకుంది. మరికొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చినా.. అవి కాగితాలకే పరిమితమయ్యాయి.

- పనికితగ్గ వేతనాలు ఇవ్వాలి..

- శంకర్‌, కార్మిక సంఘం మండల కోశాధికారి

20 ఏళ్లుగా విధుల్లో ఉన్నాం. వచ్చేవేతనం మాత్రం రూ.9500 దాటదు. జీతాలు కుటుంబాల పోషణకు ఏమాత్రం సరిపోవడంలేదు. సమాన పనికి సమానవేతనంతో నెలకు రూ.21వేలు చెల్లించాలి. నేటికాలంలో రోజువారి కూలీ చేస్తేనే సుమారు రూ. 500నుంచి రూ.1000వరకు ఇస్తున్నారు. మాకు ఆ పరిస్థితి లేదు. ఇబ్బందులను ఎవరికి చెప్పుకున్నా హామీలు గుప్పిస్తున్నారే తప్ప నెరవేర్చడం లేదు. కొత్త ప్రభుత్వమైనా స్పందించి వేతనాలు పెంచి, ఉద్యోగ భద్రత కల్పించాలి.

Updated Date - Dec 02 , 2024 | 11:44 PM