Kumaram Bheem Asifabad: మహారాష్ట్ర నుంచి పులులు
ABN , Publish Date - Dec 27 , 2024 | 10:43 PM
కాగజ్‌నగర్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోకి మహారాష్ట్ర నుంచి పులులు వస్తున్నట్లు తెలుస్తోంది. సిర్పూరు అటవీప్రాంతానికి ఈ మధ్య పులుల తాకిడి పెరిగినట్లు సమాచారం.
-ప్రజలను అప్రమత్తం చేస్తున్న అటవీఅధికారులు
-ప్రాణహిత తీరం నుంచి సిర్పూరు, కాగజ్‌నగర్ అడవుల్లోకి ప్రవేశం
కాగజ్‌నగర్, డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): జిల్లాలోకి మహారాష్ట్ర నుంచి పులులు వస్తున్నట్లు తెలుస్తోంది. సిర్పూరు అటవీప్రాంతానికి ఈ మధ్య పులుల తాకిడి పెరిగినట్లు సమాచారం. మహారాష్ట్రకు ఆనుకొని ఉన్న ప్రాణహిత నది తీరం నుంచి సిర్పూరు, కాగజ్‌నగర్ అడవుల్లోకి పులులు వస్తున్నాయి. గురువారం కూడా సిర్పూరు(టి)-మహారాష్ట్ర సరిహద్దు గ్రామమైన అమృత్‌గూడ వద్ద రహదారిపై పులి నడుచుకుంటూ వెళ్లుతుండగా కొంతమంది యువకులు సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. పులి సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. పీసీసీఎఫ్ సువర్ణ ఆధ్వర్యలో సీఎస్ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టిబ్రేవాల్ పులి ఉన్నప్రాంతాన్ని సందర్శించారు. ఐదు రోజుల క్రితం కూడా పెంచికల్‌పేట అటవీప్రాంతంలో పులి సంచారం జరిగినట్టు ప్రచారం జరుగుతోంది. దహెగాం మండలం దరోగపల్లి అటవీప్రాంతంలో కూడా పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. మహారాష్ట్ర నుంచి సిర్పూరు(టి) అటవీప్రాంతానికి వచ్చేస్తుండటంతో అటవీశాఖ అధికారులు తమవంతుగా ముందస్తుగా గ్రామల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులులు సంచారంపై ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు. అటవీ ప్రాంత సమీపంలో పొలాల ఉన్న రైతులు ఉదయం పూట పది తర్వాతనే గుంపులుగా వెళ్లాలని, సాయంత్రం నాలుగు గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
వరుస దాడులతో ప్రజల్లో ఆందోళన..
కాగజ్‌నగర్ మండలం నజ్రూల్‌నగర్‌లో గత నెల 29న పత్తి ఏరుతున్న కూలీ లక్ష్మి(22)పై దాడి చేసి చంపేసిన సంఘటన నుంచి తేరుకోక ముందే నజ్రూల్‌నగర్ క్యాంపులో మళ్లీ ఆవుపై దాడి చేసింది. గత నెల 30న పత్తి ఏరుతున్న రౌతు శంకర్‌పై దాడి చేసింది. మూడు రోజుల క్రితం కూడా సిర్పూరు(టి) చీలపెల్లిలో అటవీప్రాంతంలో ఎద్దుపై పులి దాడి చేసింది. అయితే పులులు ఎన్ని తిరుగుతున్నాయనేది స్పష్టంగా తెలియనప్పటికీ ఇవి మహారాష్ట్ర అడవుల నుంచి వస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇది పులుల సంతానోత్పత్తికి అనువైన సమయం అని అంటున్నారు. 2014లో మహారాష్ట్ర నుంచి కాగజ్‌నగర్ కడంబా ప్రాంతానికి వచ్చి ఫాల్గున అనే పులి నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. 2016లో మళ్లీ మూడు పిల్లలకు జన్మనిచ్చి రాష్ట్రస్థాయిలో గుర్తింపు తెచ్చింది. దీంతో కాగజ్‌నగర్ అటవీప్రాంతం పులుల బ్రీడింగ్ కేంద్రంగా మారటంతో వాటి సంరక్షణ విషయంలో అటవీశాఖ అధికారులు సమగ్ర చర్యలు తీసుకుంటున్నారు. ఈ ప్రాంతానికి పులుల రాక పెరగుతున్న నేపథ్యంలో పులుల సంరక్షణ కేంద్రంగా గుర్తించాలని అటవీశాఖ అధికారులు ఢిల్లీ టైగర్ మానిటరింగ్ సెల్ అధికారులకు నివేదికలు పంపించారు.
పులుల సంరక్షణకు చర్యలు..
-వినయ్ సాహు, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్
మహారాష్ట్ర నుంచి సిర్పూరు అటవీరేంజ్‌కు పులులు వస్తున్నాయి. రెండ్రోజుల క్రితం కూడా మహారాష్ట్ర నుంచి సిర్పూరు(టి) అటవీప్రాంతానికి ఓ పులి వచ్చింది. ట్రాకర్స్ ద్వారా వాటిని ట్రాకింగ్ చేస్తున్నాం. పులుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అటవీప్రాంత సమీప గ్రామాల ప్రజలకు అవగాహన పరుస్తున్నాం. పత్తి ఏరివేత చేపట్టే వారికి మాస్క్‌లను పంపిణీ చేశాం. పులిని ట్రాకింగ్ చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.