Kumaram Bheem Asifabad: ఆసిఫాబాద్ పట్టణంలో ట్రా‘ఫికర్’
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:26 PM
ఆసిఫాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజోతి): జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ, ఫుట్ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
- అస్తవ్యస్తంగా ట్రాఫిక్
- ఇరుకుగా రోడ్లు..పెరిగిన వాహనాల రద్దీ
- రోడ్లపైనే తోపుడు బండ్లు, వాహనాల పార్కింగ్
ఆసిఫాబాద్, డిసెంబరు 4 (ఆంధ్రజోతి): జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ, ఫుట్ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. చాలీచాలని రోడ్లతో ట్రాఫిక్ సమస్యకు దారితీస్తున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్న సమయంలోనే ప్రజలకు ఇబ్బందిగా మారిన ట్రాఫిక్ సమస్య జిల్లా కేంద్రం అయ్యే సరికి రెట్టింపు అయ్యాయి. జిల్లాకేంద్రం కావడంతో వాహనాల తాకిడి పెరిగింది. జిల్లా కేంద్రంలో అటు జిల్లా స్థాయి అధికారుల వాహనాలు, ఇతర మండలాల నుంచి వచ్చిపోయే వారి వాహనాల తాకిడి పెరగడంతో రోడ్డుకు ఇరువైపులా పార్కింగ్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతున్నది. ఆటో స్టాండ్‌లకు అనువైన స్థలం లేకపోవడంతో రోడ్లపైనే ఆటోస్టాండ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. మొదలే ఇరుకైన రోడ్లు, వాటిపై నిర్వహిస్తున్న ఫుట్‌పాత్ వ్యాపారం కారణంగా వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చివరకు పాదాచారులు సైతం అడుగుతీసి అడుగువేయలేని పరిస్థితి ఉంది. ప్రజలు జిల్లా కేంద్రంలోని రోడ్లపై తిరగాలన్నా అటుగుండా ప్రయాణించాలన్నా వెళ్లలేని పరిస్థితి. జిల్లాకేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా వ్యాపార, వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు ఉండడంతో పార్కింగ్ కోసం స్థలం లేక రోడ్లపైనే వాహనాలు నిలుపుతున్నారు. నిత్యం ఈ రహదారి వెంట వేలసంఖ్యలో వాహనాలు రాక పోకలు సాగిస్తుంటాయి. రద్దీగా ఉండే ఈ రోడ్డుకు ఇరువైపులా ఎక్కడపడితే అక్కడ వాహనాలను పార్కింగ్ చేయడం వాహనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. ట్రాఫిక్‌దుస్థితిపై జిల్లా అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రధానకూడళ్ల వద్ద ట్రాఫిక్ కష్టాలు..
జిల్లాకేంద్రంలో ప్రధానకూడళ్లు అయిన అంబేద్కర్‌చౌక్, వివేకానందచౌక్, గాంధీచౌక్‌లలో ట్రాఫిక్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ప్రధానకూడళ్లలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఉండడం, వీటి సమీపంలోనే ఆర్టీసీ బస్టాండు, డిపో ఉండడంతో రాకపోకలకు ఇబ్బందులు తీవ్రమవుతున్నాయి. గాంధీ చౌక్, వివేకానందచౌక్‌లలో తోపుడుబండ్లు, చిరువ్యాపారులు రోడ్లపైనే తమ వ్యాపారాలు కొనసాగిస్తుండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్లు విస్తారంగా లేకపోవడం ఇరువైపులా వ్యాపారసముదాయాలు ఉండడంతో వినియోగదారులు వస్తువుల క్రయవిక్రయాల కోసం వచ్చినప్పుడల్లా ద్విచక్రవాహనాలను, నాలుగు చక్రాలవాహనాలను రోడ్డుపైనే ఉంచి తమ పనులను కొనసాగించుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాహనాలను రోడ్లపైనే పార్కు చేయడంతో ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చింది. అలాగే జిల్లాకేంద్రానికి చుట్టుపక్కల గ్రామాలనుంచి వందలసంఖ్యలో విద్యార్థులు ఆయాపాఠశాలలకు వచ్చి ఈ చౌరస్తాలపైనే వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య తీవ్రం కావడం, వాహనాల రద్దీ ఏర్పడడంతో ప్రాథమికస్థాయి విద్యార్థుల తల్లిదండ్రులు తమపిల్లల విషయంలో ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా పార్కింగ్ స్థలాలు, రోడ్లు విస్తరిస్తే జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ ఒక కొలిక్కి వచ్చే అవకాశాలుంటాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఆదిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ట్రాఫిక్ సమస్యపై దృష్టి సారించాలి..
- ప్రణయ్, ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు ఎక్కువ అవుతోంది. వాహనాల రద్దీ పెరిగింది. రోడ్లపై వాహనాలను నడపాలంటే తీవ్ర ఇబ్బందులవుతున్నాయి. ప్రధానకూడళ్లలో రోడ్లపైనే తోపుడు బండ్లు పెట్టి వ్యాపారాలు చేస్తున్నారు. దీంతో పార్కింగ్‌తోపాటు ట్రాఫిక్‌సమస్య తలెత్తుతోంది. అధికారులు దృష్టిసారించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలి.