Kumaram Bheem Asifabad : ఉ(ఎ)త్తి పోతలు
ABN , Publish Date - Nov 06 , 2024 | 11:11 PM
ఆసిఫాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పంటలకు సాగు నీరందించే ఉద్దేశంతో జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగా నదుల వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాలు ఆయకట్టుకు చుక్క నీరందించడం లేదు.
- జిల్లాలో నిరుపయోగంగా సాగునీటి పథకాలు
- ఎత్తిపోతలకు మరమ్మతులు కరువు
- పంటపొలాలకు అందని నీరు
ఆసిఫాబాద్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): పంటలకు సాగు నీరందించే ఉద్దేశంతో జిల్లాలో ప్రాణహిత, పెన్‌గంగా నదుల వద్ద నిర్మించిన ఎత్తిపోతల పథకాలు ఆయకట్టుకు చుక్క నీరందించడం లేదు. కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన ఈ పథకాలు అన్నదాతలకు రిక్తహస్తాన్ని చూపుతున్నాయి. కొన్ని ఎత్తిపోతల పథకాల పనులు ఏళ్ల తరబడి కొనసాగుతుండగా మరి కొన్ని మరమ్మతులకు నోచుకోక మూలకుచేరాయి. దీంతో రైతులు ఏటా నష్టాలను మూటగట్టుకుంటున్నారు. జీవనదిని తలపించే ప్రాణహిత, పెన్‌గంగపై కౌటాల, చింతలమానేపల్లి, సిర్పూరు(టి) మండలాల్లో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. కౌటాల మండలంలో సాండ్‌గాం, వీర్దండి, గుండాయిపేట, తుమ్మిడిహెట్టి గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలుండగా ఏఒక్క పథకం కూడా పనిచేయడం లేదు. చింతలమానేపల్లి మండలంలోని కోర్సిని, గూడెం, రన్‌వెల్లి ఎత్తిపోతల పథకాలు పూర్తికాక నిరూపయోగంగా మారాయి.
అలంకారప్రాయంగా పథకాలు..
కౌటాల మండలంలో 10 వేల ఎకరాలకు ప్రాణహిత జలాలను పంటపొలాలకు అందించేందుకు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో పదేళ్లకిందట తుమ్మిడిహెట్టి, వీర్దండి, గుండాయిపేట, సాండ్‌గాం ఎత్తి పోతల పథకాలు నిర్మించారు. ఇవి కొన్నిరోజులపాటు ఆయకట్టు పొలాలకు నీరందించినప్పటికీ మోటార్లు చెడిపోవడంతో అలంకారప్రాయంగా మారాయి. దీంతో అన్నదాతల ఆశలు అడియాశలయ్యాయి. చింతలమానేపల్లి మండలం ఎనిమిది వేల ఎకరాల సాగుకు నీరందించే లక్ష్యంతో కోరిసిని వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకం పనులు ఎనిమిదేళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. రూ. 40 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన ఈ పథకం నేటికీ పూర్తికాలేదు. గూడెం, రనవెల్లి ఎత్తిపోత పథకాలు సైతం నేటికి పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టి సారించి ఎత్తిపోతల పథకాలకు నిధులు కేటాయించి ఉపయోగంలోకి తీసుకరావాలని ఆయకట్టు దారులు కోరుతున్నారు.
ఆయకట్టుదారుల్లో ఆందోళన..
జిల్లాలో ఎత్తిపోతల పథకాల కింద భూములను సాగుచేస్తున్న ఆయకట్టుదారుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్ల తరబడి ఎత్తిపోతల పథకాలు పూర్తికాకపోవడంతో పంటపొలాలకు చుక్కనీరందక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్లు వెచ్చించి పథకాలు ప్రారంభించినా అవి పూర్తి కాకపోవటంతో వర్షాధారంపైనే ఆధారపడాల్సిన పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. అంగట్లో అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్న చందంగా మారింది ఆయకట్టుదారుల పరిస్థితి. పుష్కలంగా జలవనరులున్నా ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యంతో ఎత్తిపోతల పథకాలు పూర్తికాక, పూర్తి అయినా మరమ్మతులు నోచుకోక ఉత్సవ విగ్రహాలుగా దర్శనమిస్తుండటంతో ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేపడితే ఈ ప్రాంత రైతులు రెండు పంటలు పండించే అవకాశాలు ఉన్నాయి.