Kumaram Bheem Asifabad: సమస్యలకు నిలయంగా సంక్షేమ హాస్టళ్లు
ABN , Publish Date - Dec 21 , 2024 | 11:52 PM
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామన్ మెనూ క్షేత్ర స్థాయిలో చాలా పాఠశాలల్లో అమలు కావడంలేదు. నేటికీ అధికారులు పాత మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు.
- చలికి వణుకుతున్న విద్యార్థులు
- రగ్గులు లేక ఇబ్బందులు
- నేలపైనే పడక
- చెడిపోయిన సొలార్ వాటర్ హీటర్లు
- విద్యార్థుల చన్నీటి స్నానాలు
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామన్ మెనూ క్షేత్ర స్థాయిలో చాలా పాఠశాలల్లో అమలు కావడంలేదు. నేటికీ అధికారులు పాత మెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని గురుకులాలు, సంక్షేమ వసతిగృహాల స్థితిగతులపై ‘ఆంధ్రజ్యోతి’ శుక్రవారం రాత్రి హాస్టల్ విజిట్ చేపట్టింది. ఈ విజిట్‌లో విద్యార్థులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు, స్థితిగతులు వెలుగులోకి వచ్చాయి.
ఆసిఫాబాద్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదవిద్యార్థులు ఉన్నతంగా చదువు కోవడానికి వీలుగా ప్రభుత్వం సంక్షేమ వసతిగృహలు, గురుకులాలు ఏర్పాటు చేసింది. గురుకులాల్లో, వసతిగృహల్లో వసతులు కొరవడంతో విద్యార్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. చలికాలం కావడంతో చలికి గజగజలాడుతు న్నారు. సరిపడా దుప్పట్లు, రగ్గులు లేకపోవడం చన్నీటితోనే స్నానాలు చేయడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. గురు కులాల్లో సరిపడా బెడ్స్ ఉన్నప్పటికీ వసతిగృహల్లో మాత్రం విద్యార్థులు నేలపైనే పడుకోవాల్సిన పరిస్థితులున్నాయి. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు,వసతిగృహాల్లో విద్యార్థులు చలికి వణికిపోతున్నారు గురుకులాలు, వసతి గృహాలు సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
జిల్లాలోని గురుకుల పాఠశాలలు..
జిల్లావ్యాప్తంగా ఐదు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలు, ఐదు సాంఘికసంక్షేమ గురుకుల పాఠశాలలు, నాలుగు మహత్మ జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలలు, మూడు మైనార్టీ గురుకులాలు, ఒక అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాల, 15 కస్తూర్బా గాంధీ పాఠశాలలు, రెండు ఆదర్శ పాఠశాలలు, 44 గిరిజనఆశ్రమ, ఆశ్రమోన్నత, ఉన్నతపాఠశాలలు, ఎస్సీ,బీసీ సంక్షేమశాఖల కింద 22వసతిగృహలు కొనసాగుతున్నాయి. ఇందులో సుమారు 12వేల పైచిలుకు విద్యార్థులు వసతి గృహల్లో ఉంటూ విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ వసతి గృహాల్లో నిర్వహణపరమైన లోపాల కారణంగా భవనాల కిటికీలు, వెంటిలెటర్‌లు దెబ్బతినడమో, పగిలిపోవడమో జర గడం వల్ల మరమ్మతులు లేక బయటి నుంచి వచ్చే ఈదురు గాలులతో విద్యార్థులంతా ఒకరినొకరు హత్తుకుని ముడ్చుకుని పడుకునే పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం ప్రతి యేటా విద్యార్థులకు చలినుంచి రక్షణ పొందేందుకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేయాల్సి ఉండగా ఈ ఏడాది ఇంతవరకు కొన్ని వసతిగృహల్లో పంపిణీ చేయలేదు. దీంతో ఇంటినుంచి తెచ్చుకున్న దుప్పట్లతోనే విద్యార్థులు కాలం వెళ్లదీస్తున్నారు. వసతిగృహల్లో ఆర్‌వోఆర్ ప్లాంట్లు పని చేయకపోవడంతో విద్యార్థులు చన్నీటి స్నానాలను చేస్తున్నారు. వసతిగృహల్లో సరిపడా బాత్‌రూంలు, మరుగుదొడ్లు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన కామన్ మెనూ క్షేత్రస్థాయిలో అమలు కావడంలేదు. నేటికీ అధికారులు పాతమెనూ ప్రకారమే విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు.
ఒంటికి,రెంటికి తిప్పలు..
ఆసిఫాబాద్‌రూరల్: ఆసిఫాబాద్ మండలంలోని గురుకులాలు, వసతిగృహల్లో సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యార్థులకు సరిపడా మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేక ఒంటికి రెంటికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. సోలార్ హీటర్లు పనిచేయక పోవడంతో చన్నీటితోనే స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కొంతమంది విద్యార్థులకు రగ్గులు, దుప్పట్లు, స్వెట్టర్లు పంపిణీ చేయకపోవడంతో చలికి వణికిపోతున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండలంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ శాఖల కింద 12 ఉన్నాయి. గురుకులాల్లో వసతులు కాస్తా మెరుగ్గా ఉన్నప్పటికీ వసతిగృహల్లో మాత్రం సమస్యలు రాజ్యమేలుతున్నాయి. కిటికీలు, తలుపులు లేకపోవడంతో విద్యార్థులు ఈదురు గాలులతో చలికి ఇబ్బందులు పడుతున్నారు.