Share News

Kumaram Bheem Asifabad: సాగు పండుగయ్యేదెన్నడు?

ABN , Publish Date - Oct 23 , 2024 | 11:11 PM

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల నిండా నీరున్నా అవి పంట పొలాలకు అందడం లేదు. మొదటినుంచి జిల్లా రైతాంగానికి వర్షాధారమే దిక్కవుతోంది.

Kumaram Bheem Asifabad:  సాగు పండుగయ్యేదెన్నడు?

- పెండింగ్‌లోనే ప్రాజెక్టులు

- ముందుకు కదలని పనులు

- జిల్లాలో ఏళ్లుగా సాగునీటి అవస్థలు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల నిండా నీరున్నా అవి పంట పొలాలకు అందడం లేదు. మొదటినుంచి జిల్లా రైతాంగానికి వర్షాధారమే దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులన్నీ పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పులేదు. సరైన సాగునీటి వసతిలేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా ఉంటోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలతో సరిపెట్టాల్సి వస్తోంది. వానొస్తేనే పంట లేకుంటే లేదు అన్న చందంగా ఉంది. అన్నదాతలు పూర్తిగా వర్షాధార పంటలపై ఆధారపడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయి సక్రమంగా నీరందిస్తే తప్ప సాగు పండుగలా మారే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా కుమరం భీం, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణపనులు పూర్తి కాలేదు. అదేవిధంగా వట్టివాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు.

పూర్తికాని కుమరం భీం ప్రాజెక్టు..

జిల్లాలో సాగునీటికి గుండెకాయవంటి కుమరంభీం ప్రాజెక్టు ఏళ్లుగా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించడం లేదు. పది టీఎంసీల సామర్థ్యంతో సుమారు రూ.600కోట్లకు పైగా అంచనాలతో నిర్మితమైన ఈప్రాజెక్టు లక్ష్యంలో సగం కూడా నీరందించడం లేదు. కుడి ప్రధానకాలువ ద్వారా ఆసిఫాబాద్‌ మండల పరిధిలో ఆరువేల ఎకరాలు, ప్రధాన ఎడమకాలువ ద్వారా ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి) మండలాల్లోని 45,500ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయి ఏళ్లు గడుస్తున్నా కాలువల పనులు పూర్తి కాలేదు.

దయనీయ స్థితిలో వట్టివాగు..

ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని చుట్టపక్కల పొలాలకు అందించాలనే ఉద్దేశంతో 1998లో 24,500ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడికాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడమ కాలువద్వారా 2,700ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్ధేశించారు. కానీ నిర్మించిన కాలు వలు ఇప్పటికే మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కోల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వానంగా మారాయి. చాలాచోట్ల కాలువలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే స్థితిలోలేదు. అధికారులు ఆధునీకరణ పనుల కోసం ప్రతిపాదనలను పంపినప్పటికీ వాటికి నిధులు విడుదల కాలేదు.

జగన్నాథ్‌‘పూర్‌’..

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగు తూనే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధిలో 15వేల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణపనులను చేపట్టినప్పటికీ నత్తనడకన కొనసాగుతున్నాయి. భూసేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో జాప్యంతో ఆయకట్టు దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మిస్తే తమ భూములు పంట పొలాలుగా మారుతాయని ఆశించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది.

Updated Date - Oct 23 , 2024 | 11:11 PM