Kumaram Bheem Asifabad: వంతెనల నిర్మాణం పూర్తయ్యేదెప్పుడో?
ABN , Publish Date - Nov 13 , 2024 | 10:40 PM
ఆసిఫాబాద్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అడవుల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్లో వాగులు, ఒర్రెలు అనేకం ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని అనుకునే ఉన్నాయి. చిన్న పాటి వానలకే వాగులు, ఒర్రెలు పొంగుతాయి.
-ఏళ్లుగా సాగుతున్న నిర్మాణ పనులు
-జిల్లాలో దశాబ్దంన్నరగా పెండింగ్లోనే ప్రధాన వంతెనలు
-అధికారుల, నాయకుల చిన్నచూపు
- వంతెనలు లేక అవస్థలు
ఆసిఫాబాద్, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): అడవుల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్లో వాగులు, ఒర్రెలు అనేకం ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని అనుకునే ఉన్నాయి. చిన్న పాటి వానలకే వాగులు, ఒర్రెలు పొంగుతాయి. వానాకాలంలో కురిసే భారీవర్షాలకు వచ్చే వరదలతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అంతంత మాత్రంగానే రహదారి సౌకర్యం ఉన్న ఆయా గ్రామాల ప్రజలు వంతెనలు లేక తీవ్రఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా వంతెన నిర్మాణపనులు సాగుతూ.. ముందుకు కదలటంలేదు. అధికారుల, నాయకుల చిన్నచూపుతో నిధులు మంజూరుకాక వంతెనలు పూర్తికాకపోవడంతో జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల ప్రజలు తీవ్రఅవస్థలు పడుతున్నారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క ఆసిఫాబాద్ మండలంలోని గుండి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కాలినడకన వాగు దాటిల్సి వచ్చింది. వాంకిడి మండలంలోని వెల్గి గ్రామానికి ఉట్నూర్ ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఎడ్లబండిపై వాగుదాటి వెళ్లాల్సి వచ్చింది. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు.
వంతెనలు లేక అవస్థలు..
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో ప్రతిఏటా వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడాల నుంచి ప్రధానపట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. జిల్లాలోని 335పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే. ఇటు ఆసిఫాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోని అయిదు ఏజెన్సీ మండలాలతోపాటు కాగజ్నగర్ డివిజన్లోని బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, కాగజ్నగర్ వరకు అన్ని మండలాల్లో ప్రజలు ఒకే రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్న చిన్న వాగులు మొదలుకుని ఎర్రవాగు, పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని వంకలపై నేటికి వంతెనలు లేకపోవడంతో ప్రజానీకం బయట ప్రపంచానికి చేరుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తోంది. జిల్లాలో ఇలా చిన్నా చితక కల్వర్టు మొదలుకుని భారీవంతెనల వరకు ఏవీ పూర్తికాకపోవడంతో ఏటా ప్రజానీకానికి ఇక్కట్లు తప్పడం లేదు. పనులను వేగవంతం చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రతివర్షాకాలంలో ఈ సమస్యలు తప్పడం లేదని వివిధ మండలాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొని ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఆయాగ్రామాల ప్రజలు తిప్పలు పడాల్సివస్తున్నది.
ఏళ్లుగా సా...గుతున్న వంతెనల నిర్మాణాలు..
గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో చేరడం లేదు. మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడి గుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెన నిర్మాణపనులు దశాబ్దాలుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్ మండలంలోని పెద్దవాగుపై గుండివంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నర కాలంపాటు కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామానికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. కెరమెరి మండలంలోని ఉమ్రి వంతెన అసంపూర్తిగా ఉండడం వల్ల మహారాష్ట్రలోని 12గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మండలంలోని అనార్పల్లి-కరంజివాడ, లక్మాపూర్ వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగజ్నగర్-వాంకిడి మండలాల మధ్య కనర్గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అసంపూర్త్తిగానే ఉంది. దీంతో ఆయాగ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.