Share News

Kumaram Bheem Asifabad: పంటలకు అడవిపందుల బెడద

ABN , Publish Date - Nov 02 , 2024 | 11:18 PM

బెజ్జూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పంట చేతికొచ్చే సమయంలో సరైన వర్షాలు కురవక ఆపసోపాలు పడుతున్న అన్నదాతకు అడవిపందుల రూపంలో మరో ఎదురుదెబ్బ ఎదురవుతోంది.

 Kumaram Bheem Asifabad:  పంటలకు అడవిపందుల బెడద

- చేలను ధ్వంసం చేస్తున్న అడవిపందులు

- తీవ్రంగా నష్టపోతున్న రైతులు

- పట్టించుకోవాలని వేడుకోలు

బెజ్జూరు, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది పంట చేతికొచ్చే సమయంలో సరైన వర్షాలు కురవక ఆపసోపాలు పడుతున్న అన్నదాతకు అడవిపందుల రూపంలో మరో ఎదురుదెబ్బ ఎదురవుతోంది. రైతులు సాగుచేస్తున్న పత్తి, వరి, కంది పంటలకు అవి చేస్తున్న నష్టం అంతా.. ఇంతా కాదు. ముఖ్యంగా సిర్పూర్‌ నియోజకవర్గంలోని బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికలపేట, సిర్పూర్‌(టి) మండలాల్లోనే పందుల బెడద ఎక్కువగా ఉంది. రైతులు సాగుచేసిన పత్తి పంటలను పూర్తిగా ధ్వంసం చేస్తున్నాయి. ప్రస్తుతం పత్తి పూత, కాత కాలం. ఈ సమయంలోపంట చేలల్లోకి అడవి పందులు గుంపులు గుంపులుగా వచ్చి నాశనం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రక్షణ కోసం అనేక పాట్లు..

సాగు చేసిన పంటలను రక్షించుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. అటవీసమీప ప్రాంత పంటచేలల్లో అడవిపందుల బెడద ఎక్కువగా ఉండటంతో అన్నదాతలు పంటచేల చుట్టూ చీరలు, జాలీలు కట్టి రక్షణ చర్యలు చేపడుతున్నారు. అయినా అడవిపందులు రక్షణ వలయాలను ధ్వంసం చేసి పంటలను నాశనం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. రాత్రి, పగలు తేడాలేకుండా పంటచేలల్లోనే కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. ఒక్కోసారి పందులు గుంపులుగా వచ్చిన సమయంలో దాడిచేస్తాయనే భయంతో ఏం చేయలేకపోతున్నామని పేర్కొంటున్నారు. పంట చేలల్లో విడతలవారీగా కుటుంబసభ్యులు కాపలా ఉంటున్నా రక్షించుకోలేక పోతున్నామన్నారు. బెజ్జూరు మండలంలోని కుశ్నపల్లి-సోమిని గ్రామాల రైతులు పత్తి,కంది పంటలను కాపాడుకునేందుకు జాలీలు ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆదుకోని ప్రభుత్వం..

జిల్లాలోని అటవీప్రాంత గ్రామాల పంటచేలల్లో కాకుండా నియోజకవర్గంలో కూడా అడవిపందుల కారణంగా ప్రతీఏటా పంటలకు నష్టం జరుగుతోంది. అయినా అటవీశాఖ ఎలాంటి సాయం అందించడం లేదు. దశాబ్దకాలంగా ఈ సమస్య అధికంగా ఉంది. అడవిపందుల కారణంగా పంటలకు నష్టం జరుగుతున్నా నష్టపరిహారం మాత్రం కూడా ఇవ్వడం లేదు. గత ప్రభుత్వ హయాంలో పంటలను ధ్వంసం చేస్తున్న అడవిపందులను చంపేందుకు ఉత్తర్వులు జారీచేసినా అనేక షరతులు పెట్టింది. దీంతో అటవీశాఖ కూడా ఏం చేయలేకపోయింది. ఇప్పటికే పలు గ్రామాల్లో ఎకరాల్లో పత్తి, వరిపంటలను ధ్వంసం కావడంతో కనీసం పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చేలా లేవని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నోఏళ్లుగా పంటలకు నష్టం సంభవిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

పరిహారం ఇవ్వాలి..

- వడ్గూరి శ్యాంరావ్‌, రైతు, ఎల్కపల్లి

అడవి పందుల దాడిలో నష్టపోయిన పంటలకు ప్రభుత్వం పరిహారం ఇవ్వాలి. ఏటా ఇదే తంతు. సాగు చేస్తున్న పత్తి, వరిపంటలకు తీవ్రనష్టం కలుగుతోంది. అయినా తమ గోడును ఎవ్వరూ పట్టించుకోవడం లేదు.

పంటలను కాపాడుకునేదెలా..

- చటారి బక్కయ్య, రైతు, ఎల్కపల్లి

ఎంతో కష్టపడి సాగుచేస్తున్న పంటలకు రక్షణ కరువైంది. పంటలను కాపాడుకునేందుకు ప్రతినిత్యం ఇంట్లో వారంతా చేలల్లోనే కాపలా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినా పంటలకు నష్టం జరుగుతూనే ఉంది. ఇక అడవిపందుల బెడద కారణంగా వ్యవసాయం చేయడం కష్టతరంగా మారింది.

Updated Date - Nov 02 , 2024 | 11:18 PM