Share News

Kumaram Bheem Asifabad: పోరుగడ్డ అభివృద్ధి చెందేనా?

ABN , Publish Date - Nov 04 , 2024 | 10:44 PM

కెరమెరి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం పోరాడి అసువులు బాసిన కుమరంభీం పోరుగడ్డ గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి.

 Kumaram Bheem Asifabad:  పోరుగడ్డ అభివృద్ధి చెందేనా?

- రూ.6కోట్లు ప్రకటించిన మంత్రి

- విడుదల కాని నిధులు

- మంత్రి హామీ అమలుకు నిరీక్షణ

కెరమెరి, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జల్‌, జంగల్‌, జమీన్‌ కోసం పోరాడి అసువులు బాసిన కుమరంభీం పోరుగడ్డ గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. మండలంలోని జోడేఘాట్‌లో గతనెల17న నిర్వహించిన భీం వర్ధంతి కార్యక్రమానికి హాజరైన శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క జోడేఘాట్‌ మ్యూజియంతోపాటు పర్యాటక ప్రాంతం కోసం రూ.6కోట్ల నిధులు, పోరుగడ్డలోని గ్రామాల ఆదివాసులకు 200ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. దీంతో ఆయాగ్రామాల ఆదివాసుల్లో ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వం రూ.25కోట్లతో కేవలం మ్యూజియం మాత్రమే ఏర్పాటు చేసింది. కానీ ఆయా గ్రామాల అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గడిచిన అర్ధ శతాబ్దానికి పైనుంచి స్థిరనివాసం ఏర్పర్చుకుని జీవితం గడుపుతున్న ఆదివాసీల జీవి తాల్లో ఎలాంటి అభివృద్ధి జాడలేదన్నది సత్యం. నాటినుంచి నేటివరకు అదే పరిస్థితుల్లో వారుకాలం వెల్లదీస్తున్నారు.

పర్యాటకానికి పెద్దపీట..

ఇప్పటికే జోడేఘాట్‌లో రూ.25కోట్లతో ఆదివాసీ మ్యూజియం, భీం స్మృతివనం, భీం నిలువెత్తు కాంస్య విగ్రహాంతోపాటు జోడేఘాట్‌ నుంచి టోకెన్‌ మోవాడవరకు 14కిలో మీటర్ల వరకు బీటీరోడ్డు నిర్మించారు. అయితే పర్యాటకులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నారు. పర్యాటకులకోసం ప్రత్యేకంగా హోటళ్లు, మినరల్‌వాటర్‌ సౌకర్యం కల్పించేందుకు నిధులు కేటాయించారు. అలాగే బాబేఝరిలో దట్టమైన అడవుల మధ్య అందాల జలపాతం ఉంది. ఇక్కడ సుమారు 30ఫీట్ల ఎత్తునుంచి నీరు జాలువారుతూ చూపరులను కనువిందు చేస్తుంది. కానీ ఈ ప్రాంతం వెళ్లడానికి ఎలాంటి రహదారి సౌకర్యం లేదు.

నిధులు మంజూరు ఎప్పుడో..

మంత్రి సీతక్క హామీ ఇచ్చి పదిహేనురోజులకు పైగా గడస్తున్నా ఇప్పటికీ ఎలాంటి నిధులు మంజూరు కాలేదు. నివేదికలు సిద్ధం చేయాలని వర్ధంతి సమావేశంలో జిల్లా కలెక్టర్‌ను మంత్రి ఆదేశించారు. ఈ తరుణంలో స్థానిక అధికారులు పలు గ్రామాల వివ రాలు, వారి జీవనస్థితిగతులు, పక్కాగృహాలు, ఇతర వివరాలు సేకరించారు. కానీ ఇంతవరకు ఇందిరమ్మ గృహాల మంజూరు లాంటివి ఇంకా ఏమీ జరగలేదు.

పోరుగడ్డలోని ఆ..12 గ్రామాలు ఇవే..

కుమరంభీం పోరుగడ్డలో ఉండే గ్రామాలైన జోడేఘాట్‌, జోడేఘాట్‌ కోలాంగూడ, పట్నాపూర్‌, లైన్‌పటార్‌, శివగూడ, చాల్‌బాడి, పాటగూడ, బాబేఝరి, గోండ్‌గూడ, టోకెన్‌మోవాడ్‌, పిట్టగూడ, కొలాంగూడ రగ్రామాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కానున్నాయి. జోడేఘాట్‌లో గత ప్రభుత్వం మంజూరు చేసిన 30డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మూడు పూర్తికాగా మిగిలిన 27గృహాలు నిర్మాణదశలోనే ఉన్నాయి. ఆయాగ్రామాల్లో పూరి గుడిసెలు ఉండగా కేవలం జోడేఘాట్‌లోనే డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు కనిపిస్తున్నాయి. అవికూడా అక్కడక్కడ ఉండడంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఒకే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లలో రెండు మూడు కుటుంబాలు నివసిస్తున్నాయి. వెంటనే జోడేఘాట్‌ గ్రామాల ప్రజలందరికీ డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సమాచారం సేకరిస్తున్నాం..

-అంజద్‌పాషా, ఎంపీడీవో, కెరమెరి

కుమరం భీం పోరుగడ్డ గ్రామాల కార్యదర్శులతో సమాచారాన్ని సేకరిస్తున్నాం. పూర్తివివరాలు సేకరించి జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తాం. ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్నిఇళ్లు అవసరమవుతాయో జిల్లా అధికారులకు ప్రతిపాదనలు పంపిస్తాం.

Updated Date - Nov 04 , 2024 | 10:44 PM