Kumaram Bhim Asifabad: కలగానే ‘తలాయి’ జల విద్యుత్‌కేంద్రం
ABN , Publish Date - May 20 , 2024 | 10:53 PM
బెజ్జూరు, మే 20: బెజ్జూరు మండలంలోని తలాయి గ్రామ సమీపంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలన్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. ప్రాణహిత నదిపై జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం హయాంలోనే సర్వేలు జరిపి పనులు ప్రారంభించారు.
- ఏళ్లు గడుస్తున్నా కార్యరూపం దాల్చని వైనం
- ప్రస్తుత ప్రభుత్వమైనా దృష్టి పెట్టేనా?
బెజ్జూరు, మే 20: బెజ్జూరు మండలంలోని తలాయి గ్రామ సమీపంలో జలవిద్యుత్ కేంద్రం నిర్మించాలన్న ప్రతిపాదన అమలుకు నోచుకోవడం లేదు. ప్రాణహిత నదిపై జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం హయాంలోనే సర్వేలు జరిపి పనులు ప్రారంభించారు. అప్పట్లో నిర్మించిన పిల్లర్లు ఇప్పటికీ దర్శనమిస్తున్నాయి. నిజాం ప్రభుత్వం పతనంతో పనులు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే జలవిద్యుత్ కేంద్రం పనులు మొదలవుతాయని భావించిన ఈ ప్రాంత ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. ఉమ్మడి ప్రభుత్వ హయాంలో తలాయి జలవిద్యుత్ కేంద్రంపై పాలకులెవ్వరూ స్పందించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణం మరుగునపడింది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా ఆ దిశగా దృష్టి సారించకపోవడంతో జలవిద్యుత్ కేంద్రంపై నీలినీడలు కమ్ముకున్నాయి. జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి అనుకూలంగా ఉన్నప్పటికీ పాలకులు పట్టించుకోని కారణంగా ఏటేటా ఆ ప్రతిపాదన చరిత్రలో కలిసి పోతోంది. నిజాంప్రభుత్వం హయాంలో చేపట్టిన ఈ ప్రతిపాదనను ఇప్పటి తరం నాయకులెవ్వరు పట్టించుకోకపోవడంతో దీని మూలంగా ఈప్రాంతం అభివృద్ధికి నోచుకోవడం లేదు.
ఉమ్మడి ప్రాజెక్టుగా..
తలాయి గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు నిర్మాణం కోసం తెలంగాణ-మహారాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రాణహితనదిపై ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న దేవలమర్రి, తెలంగాణలోని తలాయి గ్రామాల మద్య జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి నిజాం ప్రభుత్వం సర్వేలు చేపట్టింది. అప్పట్లో ఈ రెండు గ్రామాలు ఒకే ప్రభుత్వ పరిధిలో ఉండేవి. ఈలోగా నిజాం ప్రభుత్వం పతనం కావడంతో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం రెండో ధఫా సర్వేలు చేసింది. ప్రభుత్వాలు మారినా 1952నుంచి 1954వరకు దాదాపు పద్దెనిమిది నెలలపాటు సర్వే చేసినట్లు స్థానికులు తెలుపుతున్నారు. 1955లో ఇక్కడికి కొన్ని యంత్రాలు ఇతర పరికరాలను సైతం తీసుకువచ్చారు. అదే ఏడాది అక్కడ పని చేస్తున్న ఇంజనీరింగ్ అధికారుల ప్రైవేటు గుమాస్తా భార్య ప్రమాదవశాత్తు తెల్ల ఇసుక మడుగులో పడి మృతి చెందడంతో కొంతకాలం పాటు పనులు నిలిచిపోయాయి. 1956సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భావం జరగడంతో ఈసర్వే ముందుకు జరగలేదు. ఈలోగా భాషాప్రాదిపదికన రాష్ర్టాలు ఏర్పడటంతో ప్రాణహిత నది రెండు రాష్ర్టాలకు సరిహద్దుగా మారింది. హైదరాబాద్ రాష్ట్రంలో కలిసి ఉన్న చంద్రాపూర్, గడ్చిరోలి జిల్లాలు మహారాష్ట్రలో కలిసిపోయాయి. దేవలమర్రి గ్రామం సైతం మహారాష్ట్రలో కలిసింది. దీంతో ఈ ప్రాజెక్టు రెండు రాష్ర్టాల ఉమ్మడి ప్రాజెక్టుగా మారింది. 1956లో ఇక్కడికి తీసుకవచ్చిన యంత్రసామాగ్రి సైతం వెనక్కి తీసుకువెళ్లారు.
అప్పట్లో వేసిన పిల్లర్లు ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు నిజాం ప్రభుత్వం మొదటగా తలాయి వద్ద జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించింది. తలాయి వద్ద ప్రాణహిత నదిలో పుష్కలంగా నీరు ఉండటంతో వృథాగా పోతున్న జలవనరులను సద్వినియోగం చేసుకోవాలన్న సదుద్దేశ్యంతో నిజాం ఇక్కడ జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటుకు పనులు ప్రారంభించారు. నిజాం హయాంలో ప్రాణహిత నదిలో జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి చేపట్టిన పిల్లర్లు నేటికీ దర్శనమిస్తున్నాయి. అనంతరం నిజాం ప్రభుత్వం పతనం తర్వాత కొద్దిరోజులు సర్వేలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. దీంతో తర్వాత ఈ ప్రాజెక్టు విషయంలో ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడంతో కలగానే మిగిలి పోయింది.
2007లో జెన్కో సర్వే...
తలాయి వద్ద జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం కనుమరుగైపోతున్న నేపథ్యంలో చాలా ఏళ్ల తర్వాత అప్పటి ఉమ్మడి ప్రభుత్వ హయాంలో 2007లో ఏపీ జెన్కో అధికారులు తలాయి వద్ద ప్రాణహిత నదిని సందర్శించారు. ఇక్కడ జలవిద్యుత్ కేంద్రం 100మెగా వాట్ల విద్యుత్‌సామర్థ్యం గల విద్యుత్పుత్తి జరుగుతుందని అంచనా వేసిన జెన్కో అధికారులు తమకు కేవలం 25మెగావాట్ల సామర్థ్యం వరకే తమ చేతుల్లో ఉందని వెనుతిరిగారు. దీంతో దశాబ్దాల కాలంగా ఈ ప్రాజెక్టు విషయంలో ఎవ్వరూ కూడా చొరవ చూపడం లేదు. దీంతో ఇది క్రమేణా చరిత్రలో కలిసి పోయింది. 2009లో ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలోని ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు సైతం తలాయిని సందర్శించారు. ఆసమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ విద్యుత్‌కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుం టామని గ్రామస్థులకు హామీ ఇచ్చారు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు కావస్తున్నా దాని గురించి ప్రస్తావనే లేదు. ఇక్కడ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం చేపట్టినట్లయితే తెలంగాణ మహారాష్ట్రలకు రవాణా పరంగా అభివృద్ధి జరిగి ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తానికి విద్యుత్ సరిపోయే అవకాశం ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించేనా?
ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి జెన్కో అధికారులు 2007లో తలాయి వద్ద జలవిద్యుత్ కేంద్రం స్థలాన్ని పరిశీలించారు. కొన్ని రోజులు సర్వేలు చేశారు. కాగా ఆయన మరణానంతరం దీనిపై దృష్టిసారించేవారు లేకపోవడం, అనంతరం తెలంగాణ ఉద్యమం జోరందుకోవడం, అనంతరం తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం జరిగిపోయింది. అప్పట్లో మాజీమంత్రి హరీశ్‌రావు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించి తెలంగాణ ఏర్పడితే జలవిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడం అవ్వన్నీ కాలగర్భంలో కలిసిపోవడం జరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ ప్రాంత వాసుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అఽధికారంలో ఉన్నప్పుడు జెన్కో అధికారులు సర్వేలు చేయడం ద్వారా మళ్లీ ఇక్కడ సర్వేలు జరిపితే ఈ ప్రాంతం అభివృద్ధి జరిగే అవకాశం మెండుగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లయితే ఈ ప్రాంతంలో విద్యుత్ సదుపాయం కలగడంతోపాటు ఇక్కడి వారికి ఉపాధి కలిగే అవకాశం ఉన్నందున దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఉపాధి కలిగే అవకాశం..
- బోగ సంతోష్, బెజ్జూరు
తలాయి ప్రాణహిత నది వద్ద జలవిద్యుత్ కేంద్రం నిర్మించినట్లయితే ఈ ప్రాంత ప్రజలకు మెండుగా ఉపాధి దొరికే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జలవిద్యుత్ కేంద్రం నిర్మాణం చేపడతారని ఆశగా ఎదురు చూస్తున్నాం. పాలకులు, అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ప్రాణహిత నది వద్ద ప్రాజెక్టు నిర్మించి ఈ ప్రాంత యువతకు ఉపాధి కల్పించాలి.
ప్రాజెక్టుతో ఇరు ప్రాంతాల అభివృద్ధి..
- జలపతి, తలాయి
నిజాం ప్రభుత్వ హయాంలో పురుడు పోసుకున్న తలాయి జలవిద్యుత్ కేంద్రాన్ని పాలకులు పట్టించుకోని కారణంగా ఈ ప్రాంతం అన్నిరంగాల్లో వెనుకబాటుకు గురవుతోంది. ఇక్కడ ప్రాజెక్టు నిర్మిస్తే తెలంగాణ-మహారాష్ట్ర ప్రాంతాలు రవాణ, వ్యాపార రంగాల్లో అభివృద్ధి చెందే వీలు కలుగుతుంది. ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలి. తలాయి వద్ద ప్రాజెక్టు పూర్తయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సౌకర్యం కలుగుతుంది.