Telangana : పత్తి రైతుకు విత్తన కష్టాలు
ABN , Publish Date - May 29 , 2024 | 05:29 AM
ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానాకష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు.
ఆదిలాబాద్‌లో ఉదయం నుంచే విత్తనాల కోసం బారులు తీరిన రైతులు
పోలీసులు, రైతులకు మధ్య ఘర్షణ.. స్వల్ప లాఠీచార్జీ
రైతులపై ఎలాంటి లాఠీచార్జీ
జరగలేదు: ఎస్పీ గౌస్ ఆలం
ఆదిలాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతలకు పత్తి విత్తనాల కోసం నానాకష్టాలు పడుతున్నారు. గత పక్షం రోజుల నుంచే విత్తనాల కోసం దుకాణాల ముందు రైతులు పడిగాపులు కాస్తున్నారు. రాశి-659 పత్తి విత్తనాలకు జిల్లాలో భారీగా డిమాండ్ ఉండగా మార్కెట్లో దొరకడంలేదని రైతులు అంటున్నారు. జిల్లాలో ఈసారి 5.72 వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో అధికంగా 4,16,669 ఎకరాల్లో పత్తి పంట సాగవనుంది.
ఇందుకు ఈయేడు 10లక్షలకు పైగా విత్తన ప్యాకెట్లు అవసరమని అధికారులు అంచనావేశారు. అయితే రాశి-659 పత్తి విత్తనాల కోసమే రైతులు ఎగబడుతున్నారు. జిల్లాలో 1.20 వేల రాశి-659 పత్తి విత్తన ప్యాకెట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు 25 వేల ప్యాకెట్ల వరకే సరఫరా అయినట్లు తెలుస్తోంది.
నాలుగు రోజులుగా ఈ రకం విత్తనాలు మార్కెట్లో దొరకడం లేదు. దీంతో మంగళవారం ఉదయమే ఆదిలాబాద్ లోని గాంధీచౌక్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. తీవ్రమైన ఎండలోనూ దుకాణాల ముందు బారులు తీరారు. ఒక్కో రైతుకు రెండు విత్తన ప్యాకెట్లనే ఇవ్వడంతో అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడే ఓపిక లేక దుకాణాల్లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించారు. ఈ నేపథ్యం లో గాంధీచౌక్‌లోని శ్రీనివాస ఫెర్టిలైజర్ దుకాణం వద్ద పోలీసులు, రైతులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీచార్జీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా, రైతులపై లాఠీచార్జీ జరగలేదని ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ గౌస్ ఆలం ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, ఉల్లిగడ్డల మాటున తరలిస్తున్న 5.50 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనా లను మంచిర్యాల జిల్లా చెన్నూరులో పోలీసులు పట్టుకున్నారు.
విత్తనాల కొరత లేదు: వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపి
హైదరాబాద్, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పత్తి విత్తనాల కొరతలేదని, ఈ విత్తనాల కోసం రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ డాక్టర్ బి.గోపి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. 1.26 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో 49,71,404 విత్తన ప్యాకెట్లను ప్లేస్‌మెంట్ చేయగా... 9,20,613 ప్యాకెట్లు రైతులకు విక్రయించినట్లు తెలిపారు. పత్తి విత్తనాలు సమృద్ధిగా ఉన్నాయని పేర్కొన్నారు.