నకిలీ విత్తనాలపై టాస్క్’ఫోర్స్’
ABN , Publish Date - Jun 10 , 2024 | 10:17 PM
వానా కాలంలో పత్తి సీజన్ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల విత్తనాల దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంగా రూ.కోట్లు విలువ చేసే నకిలీ దందా సాగుతోంది.
మంచిర్యాల, జూన్ 10 (ఆంధ్రజ్యోతి): వానా కాలంలో పత్తి సీజన్ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల విత్తనాల దందా జిల్లాలో జోరుగా సాగుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంగా రూ.కోట్లు విలువ చేసే నకిలీ దందా సాగుతోంది. పోలీసుల కండ్లు గప్పి వివిధ రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు జిల్లాకు తరలిస్తున్నారు. నకిలీ పత్తి విత్తనాలకు అడ్డుకట్ట వేసేందుకు రామగుండం కమిషనరేట్‌లోని టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులకు పాల్పడుతున్నారు. టాస్క్‌ఫోర్స్ బృందాలు, స్థానిక పోలీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి అడ్డుకట్ట వేసేందుకు కృషి చేస్తున్నారు. ఇటీవలి కాలంలో పోలీసుల దాడుల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. కోటి పై చిలుకు విలువ చేసే నకిలీ విత్తనాలు పట్టుబడ్డాయి.
విత్తన దందా ఇలా...
పోలీసుల కండ్లు గప్పి వివిధ రాష్ట్రాల నుంచి స్మగ్లర్లు జిల్లాకు తరలిస్తున్నారు. విడి విత్తనాలు, బట్టసంచుల్లో ప్యాక్ చేసిన నకిలీ విత్త నాలను నేరుగా రైతులకు అంటగడుతున్నారు. జిల్లాలోని కొందరు డీలర్లతో సత్సంబంధాలు నెరుపుతున్న సదరు ముఠా సభ్యులు తక్కువ ధరకు వారికి సరఫరా చేస్తున్నారు. లైసెన్స్‌డ్ డీలర్ల కంటే బయటి వ్యక్తుల వద్ద విత్తనాలు చవకగా లభిస్తుండటంతో రైతులు వాటిని కొనేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన విత్తనాలతో చేసే సాగుతో పోల్చితే నకిలీ విత్తనాలతో చేసే సాగుకు పెట్టుబడిలో భారీగా వ్యత్యాసాలు ఉండటంతో రైౖతులు వాటిపై వైపే మొగ్గు చూపుతున్నారు. పోలీసుల తనిఖీల్లో భారీగా నకిలీ పత్తి విత్తనాలు బయటపడుతున్నాయి. నకిలీ విత్తనాల దుష్ప్రభావం, వాటి వల్ల కలిగే నష్టాలపై వ్యవసాయ, పోలీసులు శాఖలు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు.
వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి
మంచిర్యాల జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు దిగు మతి అవుతున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆంధ్రప్రదేశ్, మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి నకిలీ విత్తనాలు జిల్లాకు చేరుకుం టున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి, అక్కడి నుంచి అక్రమంగా జిల్లాలోని రైతులకు విక్రయిస్తున్నారు. స్మగ్లర్లు నకిలీ విత్తనాలను ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు వాహనాల్లో తరలిస్తున్నారు. ఆంరఽఽధకు చెందిన కొందరు పత్తిసాగు పేరుతో జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, తదితర ప్రాంతాలలో నివాసం ఉంటారు. ఇక్కడి భూములను కౌలుకు తీసుకొని నామమాత్రంగా వ్యవసాయం చేస్తూ ఇక్కడి విత్తన డీలర్లు, రైతులతో పరిచయాలు పెంచుకుంటారు. వారికి అనుకూలంగా ఉన్న వారితో నకిలీ పత్తి విత్తనాలను రవాణా చేస్తారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ పోలీసులు జరిపిన దాడుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పట్టుబడటమే దీనికి నిదర్శనం.
నకిలీ విత్తనాలతో దుష్ప్రభావం
పోలీసుల దాడుల్లో అధికంగా పట్టుబడుతున్న వాటిలో నిషేదిత (బీటీ-3) విత్తనాలతోపాటు హెచ్‌టీ కాటన్ (హెర్బిసైడ్ టాలరెన్స్) అధికంగా ఉంటున్నాయి. ఇవి జన్యు మార్పిడి చేసిన పత్తి విత్తనాలుగా వ్యవసాయ అధికారులు, పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విత్తనాలు గ్లైఫోసెట్ అనే కలుపు మందును తట్టుకుంటాయి. ఈ కలుపు మందు పత్తి పంటను కాకుండా మిగతా అన్ని కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. అయితే గ్లైఫోసెట్ మందు కేన్సర్ కారకమని, పర్యావరణానికి హాని కలిగిస్తున్నందున ప్రభుత్వం నిషేధించింది.
కఠిన చర్యలు తీసుకుంటాం
రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్
ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ విత్తనాలు, గైసిల్ గడ్డిమందు విక్రయాలపై కఠిన చర్యలు తీసుకొంటాం. ప్రభుత్వ సూచనలు, నిబంధనలకు అనుగుణంగా డీలర్లు విక్రయాలు సాగించాలి. నిషేధిత విత్తనాలు వాడే రైతులకు నష్టం వాటిల్లుతుంది. నకిలీ విత్తనాలు విక్రయించే ముఠా సభ్యుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలుపాలి. జిల్లాలోకి నకిలీ విత్తనాల ముఠా ప్రవేశించే అవకాశాలున్న అన్ని బార్డర్ల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశాం. నకిలీ విత్తనాల సరఫరాను ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం.