Share News

Anganwadi teachers: ఉద్యోగ విరమణ ఫలమేది?

ABN , Publish Date - Dec 16 , 2024 | 05:30 AM

అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు నిండిన వారిని తొలగించిన ప్రభుత్వం.. టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంపై ఆవేదనకు గురవుతున్నారు.

Anganwadi teachers: ఉద్యోగ విరమణ ఫలమేది?

  • ఉద్యోగ విరమణ చేసి 5 నెలలు దాటినా అంగన్‌వాడీలకు అందని సాయం

  • ఇప్పటికైనా హామీ నెరవేర్చాలని సర్కార్‌కు అంగన్‌వాడీల విజ్ఞప్తి

ఆసిఫాబాద్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లో పని చేస్తున్న టీచర్లు, ఆయాలు ఉద్యోగ విరమణ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 65 ఏళ్లు నిండిన వారిని తొలగించిన ప్రభుత్వం.. టీచర్‌కు రూ.2 లక్షలు, ఆయాలకు రూ.లక్ష ఇస్తామన్న హామీ నెరవేర్చకపోవడంపై ఆవేదనకు గురవుతున్నారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్యతోపాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిచడంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలదే ముఖ్య పాత్ర. గతంలో వీరికి ఉద్యోగ విరమణ గడువు ఉండేది కాదు. ఆరోగ్యం సహకరించే వరకు పని చేసే వారు. కానీ, ఈ ఏడాది జూలైలో 65 ఏళ్లు నిండిన అంగన్‌వాడీలను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.


ఇలా ఉద్యోగ విరమణ చేసిన టీచర్లకు రూ.లక్ష, ఆయాలకు రూ.50 వేలు ఇస్తామని మొదట్లో ప్రకటించింది. దీనిపై అంగన్‌వాడీ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అరకొర వేతనాలతో మూడు, నాలుగు దశాబ్దాలు పని చేశామని, ఇప్పుడు ఈ కొద్దిపాటి డబ్బుతో ఎలా బతకాలని ప్రశ్నించారు. దీంతో ఉద్యోగ విరమణ చేసిన టీచర్లకు రూ.2లక్షలు, ఆయాలకు రూ.లక్ష చొప్పున ఇస్తామని మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క స్వయంగా ప్రకటించారు. దీంతోపాటు వృద్ధులకు ఇచ్చే ఆసరా పింఛన్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ హామీ ఆచరణకు నోచుకోవడం లేదు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోనే 640 మంది పదవీ విరమణ చేశారు.


ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి

వయస్సు దాటిందని నన్ను ఉద్యోగం నుంచి తొలగించారు. 40 ఏళ్లకు పైగా ఉద్యోగం చేసిన మమ్మ ల్ని ఉత్త చేతులతో పంపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి.

-లలితదేవి, ఆసిఫాబాద్‌

Updated Date - Dec 16 , 2024 | 05:34 AM