Share News

Hyderabad: ఐదు పబ్బుల్లో దాడులు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్..

ABN , Publish Date - Sep 07 , 2024 | 10:48 AM

ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఐదు పబ్బుల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందన్నారు.

Hyderabad: ఐదు పబ్బుల్లో దాడులు.. నలుగురికి డ్రగ్స్ పాజిటివ్..

హైదరాబాద్: ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం అర్ధరాత్రి వరకూ ఐదు పబ్బుల్లో అధికారులు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో నలుగురు డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందన్నారు. ఐదు పబ్బుల్లో నిర్వహించిన తనిఖీల్లో 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షించగా నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. శేరిలింగంపల్లి నాలెడ్జ్ సిటీలోని m/s కోరం క్లబ్‌లో ఏడుగురిని డ్రగ్ డిటెక్షన్ కిట్స్ సాయంతో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. జూబ్లీహిల్స్ లోని m/s బేబీలోన్‌లో 12 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో పరీక్షలు నిర్వహించగా ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది.


డ్రగ్స్ పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్‌కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళంకి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్‌కు చెందిన అబ్దుల్ రహీమ్‌లు ఉన్నారు. ఈ తనిఖీల్లో జాయింట్ కమిషనర్ ఖురేషి, హైదరాబాద్ రంగారెడ్డి అసిస్టెంట్ కమిషనర్ ఆర్ కిషన్, అనిల్ కుమార్ రెడ్డిలతో పాటు టీజీ నాబ్ పోలీసులు, ఎక్సైజ్ పోలీసులు పాల్గొన్నారు. కాగా.. ప్రతి వీకెండ్‌లోనూ పోలీస్ అధికారులు పబ్‌లపై దాడులు నిర్వహిస్తూ వస్తున్నారు. వారం క్రితం కూడా టిజినాబ్, ఎక్సైజ్ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డిలోని 25 పబ్బులపై తనిఖీలు నిర్వహించారు.


పబ్బుల్లో కాస్త అనుమానంగా వ్యవహరించిన 107 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్లతో పరీక్షలు నిర్వహించగా.. ఐదుగురికి పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్‌ సరఫరా, వినియోగంపై నార్కోటిక్‌ బ్యూరో అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలోనే సరికొత్త కార్యక్రమానికి కార్యాచరణ రూపొందించారు. డ్రగ్స్‌ ఫ్రీ నగరమే లక్ష్యంగా తెలంగాణ నార్కోటిక్‌ బ్యూరో అధికారులు లోకల్‌ స్మగ్లర్లతో పాటు అంతర్రాష్ట్ర ఘరానా స్మగ్లర్ల ఆటకట్టించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే పలు పబ్బులపై ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తరహాలోనే డ్రగ్స్‌ టెస్టులను నిర్వహిస్తున్నారు. ప్రధానంగా కార్పొరేట్‌ కాలేజీల విద్యార్థులు, ఐటీ కంపెనీ ఉద్యోగులు మత్తు బారిన పడుతున్నట్లు గుర్తించారు.

Updated Date - Sep 07 , 2024 | 10:48 AM