Share News

ప్రైవేటులో ఆయుష్మాన్‌ భారత్‌ అందని ద్రాక్షే

ABN , Publish Date - Oct 14 , 2024 | 04:25 AM

ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఆయుష్మాన్‌ భారత్‌)ను తెలంగాణ వాసులకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి మాత్రమే అమలు చేస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది.

ప్రైవేటులో ఆయుష్మాన్‌ భారత్‌ అందని ద్రాక్షే

  • ఆరోగ్యశ్రీనే అందుబాటులో.. గత సర్కారు నుంచీ ఇంతే

  • ఇతర రాష్ట్రాల ప్రజలకు మాత్రం పథకం వర్తింపు

  • ఆరోగ్యశ్రీలో లేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్‌లో..

  • స్థానికులకూ వర్తింపజేస్తే ఎంతోమందికి ప్రయోజనం

  • వృద్ధులకు కేంద్రం ప్రకటించిన ఆరోగ్య బీమాపైనా అనిశ్చితి

హైదరాబాద్‌, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఆయుష్మాన్‌ భారత్‌)ను తెలంగాణ వాసులకు కాకుండా ఇతర రాష్ట్రాల వారికి మాత్రమే అమలు చేస్తున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. దీనివల్ల, ఆయుష్మాన్‌ భారత్‌కు అన్ని అర్హతలు ఉండి కూడా.. దానిని ఉపయోగించుకోలేకుండా తెలంగాణవాసులు ఉన్నారు. ఆరోగ్యశ్రీ అందుబాటులో ఉన్నప్పటికీ.. దానిలో కవర్‌కాని చికిత్సలు కొన్ని ఆయుష్మాన్‌భారత్‌లో ఉంటున్నాయి. వీటి కోసం ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే.. రాష్ట్ర ప్రజలకు అది అందుబాటులో ఉండటం లేదు.

వాస్తవానికి, కేంద్రం ఆయుష్మాన్‌ భారత్‌ను ప్రవేశపెట్టిన తర్వాత నాటి బీఆర్‌ఎస్‌ సర్కారు మనదగ్గర దీన్ని తొలుత అమలు చేయలేదు. దీనిపై విమర్శలు రావడంతో 2021 మే నుంచి అమలు చేసేందుకు అంగీకరించింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకే పరిమితం చేసింది. ఈ స్కీమ్‌ కింద నమోదు చేసుకోవటానికి కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు ప్రయత్నించినా కూడా నాటి రాష్ట్ర ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు నో చెప్పారు. దీంతో, ఆసక్తి ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని తమ వద్ద అమలు చేయలేకపోయాయి.

కాగా.. హైదరాబాద్‌ నగరంలో ఇతర రాష్ట్రాలకు చెందిన కార్మికులు, వలసవచ్చిన వారు పెద్దసంఖ్యలో ఉన్నారు. వారికి ఇక్కడ ఆరోగ్యశ్రీ కార్డు లేకపోవడంతో ఆయుష్మాన్‌ భారత్‌ ఒక వరంలా మారింది. అయితే ప్రభుత్వ ఆస్పత్రుల్లో తప్ప ప్రైవేటులో ఈ కార్డు కింద చికిత్స అందటం లేదన్న విషయాన్ని కొందరు లబ్ధిదారులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం ఆదేశాల మేరకు.. హైదరాబాద్‌లో ఆయుష్మాన్‌ భారత్‌లో నమోదైన ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇతర రాష్ట్రాల వారికి చికిత్సలు అందించే వెసులుబాటును నాటి రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. రాష్ట్ర ప్రజలకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు.


  • 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్య సేవలు

ప్రస్తుతం రాష్ట్రంలో రాజీవ్‌ ఆరోగ్య శ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ పథకాలను కలిపి అమలు చేస్తున్నారు. మొత్తం 85 లక్షల కుటుంబాలకు ఆరోగ్యశ్రీ కార్డులున్నాయి. అందులో కేంద్రం మార్గదర్శకాల మేరకు ఆయుష్మాన్‌ భారత్‌ కింద 26 లక్షల కుటుంబాలను గుర్తించారు. ఆరోగ్యశ్రీ కింద ఒక కుటుంబానికి ఏడాదికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలందిస్తుండగా, ఆయుష్మాన్‌ కింద రూ.5 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. 1042 ప్రభుత్వ, 368 ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి.

ఆయుష్మాన్‌ భారత్‌ కింద సుమారు 1400 రకాల ఆరోగ్య సేవలు (ప్యాకేజీలు) ఉండగా, ఆరోగ్యశ్రీ కింద 1835 ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. రెండింట్లోనూ అత్యధికం ఒకే రకమైనవి. ఆరోగ్యశ్రీలో లేని కొన్ని చికిత్సలు ఆయుష్మాన్‌ భారత్‌లో ఉన్నాయి. కానీ, ఆయుష్మాన్‌ భారత్‌ ప్రైవేటు ఆస్పత్రుల్లో అందుబాటులో లేకపోవటంతో.. దానిని ఉపయోగించుకునే వీలు రాష్ట్ర ప్రజలకు లేకుండా పోతోంది.


  • 70 దాటిన వారి పరిస్థితి ఏమిటో?..

70 ఏళ్లు దాటిన వయో వృద్ధులందరికీ ఆదాయంతో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ పథకానికి రాష్ట్రంలో 10 లక్షల మంది అర్హత కలిగి ఉంటారని అంచనా. అయితే, వారు సదరు బీమా పథకానికి అర్హులైనా.. ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్తే (ఆయుష్మాన్‌ భారత్‌ అమలు కాని కారణంగా..) చికిత్స చేయించుకునే పరిస్థితి ప్రస్తుతం లేదు.

వృద్ధాప్యంలో ఆరోగ్య సమస్యలు పెరుగుతుంటాయి. కాబట్టి, ఆయుష్మాన్‌ భారత్‌ను రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ తెలంగాణ వాసులకు వర్తింపజేస్తూ అమలు చేయాలని పలువురు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఆయుష్మాన్‌కార్డు గుర్తింపు కార్డు కోసం లబ్ధిదారులు ఆయుష్మాన్‌ భారత్‌ పీఎం-జేఏవై వెబ్‌సైట్‌లో ఆధార్‌ లేదా రేషన్‌ కార్డును వెరిఫై చేసుకోవాలి. కుటుంబ సభ్యుల వివరాలను పొందుపరచాలి. అనంతరం ఏబీ-పీఎంజేఏవై ఐడీ ఈ-కార్డ్‌ను ప్రింటవుట్‌ తీసుకోవచ్చని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.

Updated Date - Oct 14 , 2024 | 04:25 AM