Balka Suman: రేవంత్ రెడ్డి సవాల్ చేసి తోక ముడిచారు.. బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Feb 28 , 2024 | 05:13 PM
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.
లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) సమీపిస్తున్న తరుణంలో.. తెలంగాణలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్ఎస్ (BRS) నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanth Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సవాల్ విసిరే అర్హత ముఖ్యమంత్రికి లేదని, గతంలోనూ ఓ సవాల్ చేసి రేవంత్‌రెడ్డి తోక ముడిచారని అన్నారు. తాను కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ చెప్పారని.. కానీ ఆ మాట తప్పారని.. మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేశారని అన్నారు.
ఇదే సమయంలో బాల్క సుమన్ కాంగ్రెస్ పార్టీకి ఓ సవాల్ విసిరారు. దమ్ముంటే రాహుల్ గాంధీని (Rahul Gandhi) ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించి.. పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌కు కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు, హామీలను నమ్మి జనం ఓటు వేస్తే.. ప్రభుత్వం వాళ్లకు శఠగోపం పెడుతోందని ఆరోపించారు. ఎన్నికల ముందు అందరికీ గృహజ్యోతి ఇస్తామని చెప్పి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారని విమర్శించారు. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వాళ్లందరికీ రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని కోరారు. కోటి పది లక్షల మంది గృహ విద్యుత్ వినియోగ దారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని పేర్కొన్నారు.
కాళేశ్వరంలో (Kaleshwaram) బ్యారేజ్‌లు కొట్టుకుపోవాలని కుట్ర చేస్తున్నారని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. మేడిగడ్డకు వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు ఎవరూ భయపడరని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరిగిన చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. అర్హులైన వారికి వెంటనే రైతుబంధు ఇవ్వాలని.. మెగా డీఎస్‌సీ వేయడంతో పాటు నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని బాల్క సుమన్ డిమాండ్ చేశారు.