Bandi Sanjay: అధ్యక్ష రేసులో లేను
ABN , Publish Date - Dec 16 , 2024 | 05:22 AM
బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు.
రాష్ట్ర పార్టీలో నియామకాలపై చర్చ కూడా జరగలే
నాకు బాధ్యతలు అప్పగిస్తారనేది ఊహాగానాలే
మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యతలో ఉన్నా..
తప్పుడు ప్రచారాలతో నాపై కుట్రలు పన్నుతున్నారు
కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు
కరీంనగర్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి రేసులో తాను లేనని ఆ పార్టీ నేత, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. పార్టీ నాయకత్వం తనకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి రూపంలో పెద్ద బాధ్యత అప్పగించిందని, దానిని సమర్థవంతంగా నిర్వర్తించేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఈ మేరకు కరీంనగర్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బండ్ సంజయ్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తారనే మాటలు ఊహాగానాలేనని తేల్చి చెప్పారు.
పార్టీ అధినాయకత్వం రాష్ట్ర అధ్యక్ష పదవిపై అసలు దృష్టి సారించనేలేదన్నారు. పార్టీలో ప్రస్తుతం సంస్థాగత ఎన్నికలు జరుగుతున్నాయని, జిల్లా, రాష్ట్ర అధ్యక్ష నియామకాల అంశమే చర్చకు రాలేదని వివరించారు. పార్టీ అధ్యక్ష పదవి నియామకంపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని వెల్లడించారు. తనపై అభిమానంతో కొందరు ప్రచారం చేస్తున్నారే తప్ప రాష్ట్ర అధ్యక్ష రేసులో తాను లేనని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రచారాలతో కొందరు తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తనకు, పార్టీకీ నష్టం కలిగించే తప్పుడు వార్తలను ప్రచారం చేయవద్దని మీడియాను కోరారు.