Share News

Bandi Sanjay: రాహుల్‌.. సమాధానం చెప్పు ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది?

ABN , Publish Date - Nov 06 , 2024 | 02:55 AM

‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. రాహుల్‌ గాంధీకి ఆరు గ్యారెంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా..?’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు.

Bandi Sanjay: రాహుల్‌.. సమాధానం చెప్పు ఆరు గ్యారెంటీల అమలు ఏమైంది?

  • తెలంగాణ మోడల్‌పై మహారాష్ట్రలో ప్రకటనలా?: సంజయ్‌

సిరిసిల్ల, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): ‘కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారు. రాహుల్‌ గాంధీకి ఆరు గ్యారెంటీలపై సమాధానం చెప్పే దమ్ముందా..?’ అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ప్రశ్నించారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పిన తర్వాతే రాహుల్‌ తెలంగాణకు రావాలని అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో అభివృద్ధి పనులకు సంజయ్‌ శంకుస్థాపన చేశారు. రుద్రంగి, కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామల్లోని ఆలయాల్లో పూజలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలతో కర్ణాటక, తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌.. మహారాష్ట్రలోనూ దొంగ హామీలు, అబద్ధాలతో ఓట్లు దండుకోవాలని చూస్తోందని విమర్శించారు.


తెలంగాణలో గ్యారెంటీలను అమలు చేస్తున్నట్లు, ఎంతో అభివృద్ధి చేస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటూ మహారాష్ట్రలోని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం సిగ్గు చేటన్నారు. గతంలో కేసీఆర్‌ ఇలాగే తెలంగాణ సొమ్మును మహారాష్ట్ర, పంజాబ్‌లో పంచారని.. కాంగ్రెస్‌ నేతలు ఆయన్ను మించిపోయారని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలకు కప్పం కడుతూ మహారాష్ట్ర ఎన్నికలకు తెలంగాణ పైసలను వాడుకుంటారా..? అని విమర్శించారు. బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి ఎన్నిక జనవరిలో జరిగే అవకాశం ఉందని పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బోలాసింగ్‌ తెలిపారు. పార్టీ సంస్థాగత ఎన్నికల పర్వం జనవరి వరకు కొనసాగుతుందని చెప్పారు.

Updated Date - Nov 06 , 2024 | 02:55 AM