Share News

Bhatti Vikramarka: కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారు

ABN , Publish Date - Nov 28 , 2024 | 04:02 AM

బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సను కూకటి వేళ్లతో సహా పెకిలించడం ఎవరి తరమూ కాదన్నారు.

Bhatti Vikramarka: కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారు

  • కాంగ్రె్‌సను పెకిలించడం ఎవరి తరం కాదు

  • గురుకుల ఘటనలపై సర్కారు సీరియస్‌

  • కాంగ్రెస్‌ పంచిన 26 లక్షల ఎకరాల అసైన్డ్‌ లెక్కలు తీస్తున్నాం

  • మీడియాతో ఇష్టాగోష్ఠిలో డిప్యూటీ సీఎం

హైదరాబాద్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ భ్రమల్లో బతుకుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. కాంగ్రె్‌సను కూకటి వేళ్లతో సహా పెకిలించడం ఎవరి తరమూ కాదన్నారు. ‘గత కొద్ది రోజులుగా కేటీఆర్‌ ఏమి.. ఎందుకు మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నడు. కలెక్టర్‌ను పట్టుకుని సన్యాసి అంటున్నాడంటే ఆయన మైండ్‌ సెట్‌ సరిగా లేదని అర్థమవుతోంది’ అని వ్యాఖ్యానించారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో భట్టి ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. మంత్రుల్లో అభిప్రాయ భేదాలు లేవని, తమవి ఉమ్మడి నిర్ణయాలని చెప్పారు. తాము బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపునకు ప్రోత్సహించట్లేదన్నారు. వారే అక్కడ ఇమడలేక గ్రూపులుగా మారి ఆ పార్టీని వీడుతున్నారని చెప్పారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా తమకు టచ్‌లోనే ఉన్నారన్నారు. ప్రగతిశీల ఆలోచన, సంక్షేమం, అభివృద్ధి అనే మూడు అంశాలతో ముందుకెళ్తున్నామని తెలిపారు. రైతు భరోసా విధివిధానాలపై కసరత్తు జరుగుతోందన్నారు.


రుణమాఫీ విషయంలో రేషన్‌ కార్డులు లేక.. పొరపాట్లు జరిగి ఉన్నవాటికి సంబంధించి సర్వే చేసి వారికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో ఇటీవల చోటుచేసుకుంటున్న సంఘటనలపై ప్రభుత్వం సీరియ్‌సగా ఉందన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు.. ఆయా వసతి గృహాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలంటూ సీఎం ఆదేశించారని తెలిపారు. ‘రాష్ట్రంలో ఏయే కులాల వారు ఎంతమంది? రాజ్యాంగ ప్రవేశిక ప్రకారం అందరూ సమానంగా ఎదిగారా? లేదా? అన్నది తెలుసుకునేందుకు కులగణన సర్వే చేస్తున్నాం. ఇంతకాలం రాష్ట్రాన్ని దోపిడీ చేసిన బ్యాచ్‌కు ఈ లెక్కలు తీస్తే ఇబ్బంది.. అందుకే వ్యతిరేకిస్తోంది’ అన్నారు. హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించామని, త్వరలోనే పెద్ద ఎత్తున ప్రారంభోత్సవాలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో పంచిన 26 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూముల వివరాలు ేసకరిస్తున్నామని, ధరణి వచ్చిన తర్వాత వాటి పరిస్థితి ఏంటన్నది ఆరా తీస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న అసైన్డ్‌ భూములను తిరిగి అర్హులైన వారికి పంచుతామని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ గ్రాఫ్‌ పెరుగుతోందని, బీజేపీకి డౌన్‌ ట్రెండ్‌ ప్రారంభమైందని భట్టి చెప్పారు.


  • కేటీఆర్‌ దందాలు బయటికి తెస్తున్నారనే: ఆది శ్రీనివాస్‌

అధికారం పోయినా కేటీఆర్‌కు ఇంకా అహంకారం తగ్గలేదని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. సీఎం రేవంత్‌ మొదలుకుని సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ వరకు అందరిపైనా కేటీఆర్‌ నోరు పారేసుకుంటున్నాడని మండిపడ్డారు. సీఎల్పీ మీడియా హాల్లో మాట్లాడుతూ.. సిరిసిల్లలో గత పదేళ్లుగా కేటీఆర్‌ చేసిన భూ, ఇసుక దందాలను కలెక్టర్‌ బయటకు తీస్తున్నందునే ఆయనపై అక్కసు వెల్లగక్కుతున్నాడన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిర్మాణాత్మక పాత్రను పోషించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా సంకుచిత మనస్తత్వంతో వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.


  • క్రిస్మస్‌కు ఏర్పాట్లు చేయండి:భట్టి

రాష్ట్రంలో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేయాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రజా భవన్‌లో వేడుకల కమిటీ సభ్యులు, ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 200 ప్రాంతాలు, 95 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రిస్మస్‌ ఉత్సవాలు నిర్వహించనున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరిగే క్రిస్మస్‌ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరవుతారన్నారు.

Updated Date - Nov 28 , 2024 | 04:02 AM