Bhatti Vikramarka: రైతు భరోసా పక్కా
ABN , Publish Date - Dec 07 , 2024 | 03:02 AM
సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేసి తీరుతామని, ఇందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
సంక్రాంతి తర్వాత అమలు చేసేలా నిధుల సమీకరణ
త్వరలో పునరుత్పాదక విద్యుత్ విధానం
‘విద్యుత్’పై బీఆర్‌ఎ్‌సది దుష్ప్రచారం: డిప్యూటీసీఎం భట్టి
నేడు యాదాద్రి 800 మెగావాట్ల ప్లాంట్ ప్రారంభం
హైదరాబాద్, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని పక్కాగా అమలు చేసి తీరుతామని, ఇందుకు కావాల్సిన నిధులు సమకూర్చుకుంటున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. త్వరలో సమగ్ర పునరుత్పాదక విద్యుత్ విధానాన్ని తీసుకొస్తామని, అసెంబీ సమావేశాల్లో కొత్త విద్యుత్ విధానాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. అలాగే, విజన్-2047 డాక్యుమెంట్ రూపకల్పనకు కసరత్తు జరుగుతోందని తెలిపారు. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతు భరోసా అమలుకు అవసరమైన దాదాపు రూ.10 వేల కోట్లను సమకూరుస్తున్నామని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నం అయ్యిందని భట్టి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 15వ తేదీ దాకా వేతనాలు చెల్లించే వారు కాదని గుర్తు చేశారు. కానీ, తాము అధికారం చేపట్టిన తర్వాత మార్చి నెల నుంచి ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతీ నెలా ఒకటో తేదీన క్రమం తప్పకుండా వేతనాలు, పెన్షన్లు ఇస్తున్నామని వివరించారు.
కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసిందని, 2023 డిసెంబరు నుంచి ఇప్పటిదాకా తాము రూ.52,118 కోట్ల అప్పులు తెచ్చామని భట్టి తెలిపారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు, వడ్డీ కింద తాము రూ.64,516 కోట్లు చెల్లించామని చెప్పారు. మూలధన వ్యయం కింద ఇప్పటివరకు రూ.24,036 కోట్లు, ప్రజా సంక్షేమ పథకాల కోసం మరో రూ.61,194 కోట్లను వెచ్చించామని చెప్పారు. ఇందులో రుణ మాఫీకి రూ.20,617 కోట్లు, రైతు భరోసాకు రూ.7,625 కోట్లు, చేయూతకు రూ.11,382 కోట్లు, ఆరోగ్యశ్రీకి రూ.890 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.11,141 కోట్లు వెచ్చించామన్నారు. విద్యుత్ రంగాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన గత పాలకులు సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. డిమాండ్ ఎక్కువ ఉన్నా... ఎలాంటి కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని భట్టి తెలిపారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు పర్యావరణ అనుమతిని తీసుకురాకుండా గత ప్రభుత్వం గాలికొదిలేస్తే తాము అనుమతులు తీసుకొచ్చామని వివరించారు. ఈ ప్రాజెక్టులోని 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఓ ప్లాంట్‌ను శనివారం గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. గృహజ్యోతి పథకం కింద ఇప్పటిదాకా 3,64,57,380 జీరో బిల్లులు జారీ అయ్యాయని, ప్రజలకు రూ.1336 కోట్లు ఆదా అయ్యాయని భట్టి తెలిపారు.