Kiran Kumar Reddy: మాటలకే పరిమితమైన ముప్పై ఏళ్ల మూసీ ప్రక్షాళనను ముందుకు తీసుకెళ్తున్న రేవంత్
ABN , Publish Date - Oct 06 , 2024 | 03:18 AM
ఎంతోమంది ముఖ్యమంత్రులు, గొప్ప నాయకులు మూసీని ప్రక్షాళన చేస్తామని ముప్పై ఏళ్లుగా చెబుతూ వస్తున్న మాటలు కార్యరూపం దాల్చలేదని, అలాంటి గొప్ప కార్యాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి
రైతులతో కాంగ్రెస్ భేటీ
మన్సూరాబాద్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): ఎంతోమంది ముఖ్యమంత్రులు, గొప్ప నాయకులు మూసీని ప్రక్షాళన చేస్తామని ముప్పై ఏళ్లుగా చెబుతూ వస్తున్న మాటలు కార్యరూపం దాల్చలేదని, అలాంటి గొప్ప కార్యాన్ని ధైర్యంగా ముందుకు తీసుకెళుతున్న ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాల రైతులు, కాంగ్రెస్ నాయకులతో శనివారం హైదరాబాద్‌లోని నాగోల్ శుభం కన్వెన్షన్ సెంటర్‌లో ‘మూసీని ప్రక్షాళన చేద్దాం.. రైతులను కాపాడదాం’ అనే నినాదంతో యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ రెడ్డి నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ కేసీఆర్ మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పి మూసీ రివర్‌ఫ్రంట్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యి కోట్లు కేటాయించి ఏం చేయలేదన్నారు. తాము చేస్తున్న మంచి పనులు చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు మూసీ పరీవాహక నివాసితులను భయభ్రాంతులను చేసి రెచ్చగొడుతున్నారన్నారు. ప్రతిపక్షాలకు ఏ మాత్రం ప్రజలకు మంచి చేయాలని ఉన్నా మూసీ ప్రక్షాళనకు సహకరించి సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. వివిధ జిల్లాలు, రాష్ట్రాల నుంచి బతుకుతెరువు కోసం వచ్చిన సుమారు 2 కోట్ల మంది ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకమైన హైదరాబాద్‌ను అందించేందుకు రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుసాగుతోందని నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి అన్నారు.
మూసీ పరీవాహక ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం తగిన న్యాయం చేస్తోందన్నారు. మూసీ ద్వారా ప్రవహించే మురుగు నీటి వల్ల దిగువ ప్రాంతాల రైతులు వేసిన పంటలు సరిగ్గా పండక తీవ్ర నష్టం వాటిల్లుతోందని తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేస్తామంటే తాము ఆహ్వానించామని, అప్పుడు చెప్పి చేయలేకపోగా.. నేడు ఆ పనిని ముందుకు తీసుకెళ్తుంటే హర్షించి సహకరించాలని సూచించారు. జహీరాబాద్ ఎంపీ షట్కర్ సురేష్ కుమార్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు కుంభం అనీల్ కుమార్ రెడ్డి, మందుల సామ్యూల్, మల్‌రెడ్డి రంగారెడ్డి, రోడ్ల అభివృద్ధి సంస్థ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్‌పర్సన్ బండ్రు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.