Payal Shankar: ట్రాక్టర్‌పై అసెంబ్లీకి బీజేపీ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Dec 10 , 2024 | 03:59 AM
రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తలపాగాలు ధరించి ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చారు.
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రైతుల సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ ఎమ్మెల్యేలు సోమవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. తలపాగాలు ధరించి ట్రాక్టర్‌పై అసెంబ్లీకి వచ్చారు. బీజేఎల్పీ ఉప నేత పాయల్ శంకర్ స్వయంగా ట్రాక్టర్ నడపగా, ఎమ్మెల్యేలు పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పాటిల్ చెరో పక్క కూర్చున్నారు. ఉదయం 9.30గంటలకు ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారు నేరుగా అసెంబ్లీ వద్దకు చేరుకోగా, మెయిన్ గేటు వద్ద సూర్యనారాయణగుప్తా, వెంకటరమణారెడ్డి, రాకేశ్‌రెడ్డిలు వారితో జత కలిశారు.
అనంతరం ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ... రుణమాఫీ, రైతుభరోసా వంటి హామీల అమలు చేయకుండా కాంగ్రెస్, మోసం చేసిందని, ఇప్పటికీ లక్షల మంది రైతులకు రుణమాఫీ జరగలేదని ఆరోపించారు. కాగా, ముందు ఎడ్లబళ్లపై అసెంబ్లీకి వెళ్లాలని బీజేపీ ఎమ్మెల్యేలు భావించారు. అయితే, ఎడ్లు బెదిరే అవకాశం ఉన్నందున ట్రాక్టర్‌పై వచ్చారు.