KCR BRS: ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఆ రెండు స్థానాలపై అదే సస్పెన్స్!
ABN , Publish Date - Mar 03 , 2024 | 04:59 PM
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ నేతలతో నేడు (ఆదివారం) జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది.
హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులపై ఒక నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న పలువురి పేర్లను ఖరారు చేసినట్టుగా సమాచారం. కరీంనగర్ నుంచి బోయినపల్లి సంతోష్ కుమార్, పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ పార్టీ నేతలతో నేడు (ఆదివారం) జరిగిన సమావేశంలో ఈ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. ఇక ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో యువతకు పెద్ద పీట వేయాలనే యోచనలో ఉన్న గులాబీ పార్టీ బాస్.. సికింద్రాబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్, వరంగల్ నుంచి కడియం కావ్య, నల్గొండ నుంచి గుత్తా అమిత్ రెడ్డి, జహీరాబాద్ నుంచి పోచారం భాస్కర్ రెడ్డి పేర్లను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఇక మల్కాజిగిరి లేదా చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి కాసాని వీరేశంను బరిలోకి దింపాలని గులాబీ పార్టీ యోచిస్తోంది.
మల్కాజ్‌గిరి, చేవెళ్లపై టికెట్లపై ఎడతెగని ఉత్కంఠ!
మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేయనున్నారనే సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మరో నియోజకవర్గం చేవెళ్ల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పోటీకి నిరాకరిస్తున్నారు. ఇప్పటికే అధిష్ఠానం ఆయన పేరుని ఖరారు చేసినప్పటికీ ఆయన సుముఖంగా లేరు. అయితే మరోసారి పోటీ చేయాలని బీఆర్ఎస్ పెద్దలు రంజిత్ రెడ్డిని బుజ్జగిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ ఆయన ఆయన నిర్ణయం మార్చుకోలేదని, పోటీ చేయనని తేల్చిచెప్పినట్టుగా తెలుస్తోంది. దీంతో చేవెళ్ల టికెట్‌పై బీఆర్ఎస్ పార్టీలో అనిశ్చితి కొనసాగుతోంది. కాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నేడు (ఆదివారం) పలువురు ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చేవెళ్ల టికెట్‌పై చర్చ జరిగిందని తెలుస్తోంది. ఇక్కడి నుంచి ప్రత్యమ్నాయంగా కాసాని వీరేశం పేరుని పరిశీలించినట్టు సమాచారం.