Former CM KCR : ప్రాంతీయ పార్టీలదే కీలకపాత్ర
ABN , Publish Date - May 14 , 2024 | 05:44 AM
ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించబోతున్నాయని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదు
ప్రధాని మోదీపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది
మీడియాతో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్
సిద్దిపేట/సిద్దిపేటటౌన్/బంజారాహిల్స్, మే 13 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ఫలితాల తర్వాత దేశంలో ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషించబోతున్నాయని బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సిద్దిపేట జిల్లా చింతమడకలో సోమవారం ఓటు వేసిన అనంతరం జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.
ఈ ఎన్నికల్లో బీజేపీకి పరాభవం తప్పదని చెప్పారు. బీజేపీ సొంత నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటిన తర్వాత ఎవరూ ఏ పదవినీ చేపట్టరని, మోదీ కూడా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని అన్నారు. ఇండియా కూటమిలో చేరతారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా మారనున్నాయని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు.
ఎన్నికలు.. సువర్ణావకాశం: కేటీఆర్
ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరూ ప్రాధాన్యం ఇవ్వాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఓటువేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు బయటకు వచ్చి ఓటు వేయడం వల్ల దేశాభివృద్ధికి నాంది పలికినట్టు అవుతుందన్నారు.
కాగా, ప్రశ్నించే గొంతుక ఉండాలని ప్రజలు ఆలోచిస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. ఓటు వేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా పోలింగ్ నమోదవుతుందని, పట్టణాల్లోనూ గతంలో కంటే ఎక్కువ నమోదు కావడం సంతోషదాయకమన్నారు.