BRS : పార్టీ మారిన ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేయాలి
ABN , Publish Date - Jun 26 , 2024 | 05:50 AM
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి.. కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని, పార్టీ మారిన వారిని వదిలి పెట్టబోమని, ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి
రేవంత్.. మా ఎమ్మెల్యేలను చేర్చుకుంటే తప్పు సరికాదు: నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి.. కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని రద్దు చేయాలని, పార్టీ మారిన వారిని వదిలి పెట్టబోమని, ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జి.జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఎమ్మెల్సీ తాత మధుతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ తన పదవిని కాపాడుకునేందుకే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రె్‌సలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని వారిపై పిటిషన్ ఇచ్చేందుకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను సమయం కోరామని, రెండు రోజుల్లో సమయమిస్తానని ఆయన చెప్పినట్లు వారు వెల్లడించారు.
‘లోక్‌సభ ఎన్నికల ఫలితాలు.. తన పాలనకు రెఫరెండమన్న సీఎం రేవంత్ రెడ్డి మాటకు దిక్కులేకుండా పోయింది. తెలంగాణలో కాంగ్రెస్ వైఫల్యంపై వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు ఆ పార్టీ అధిస్ఠానం ప్రత్యేక కమిటీవేసింది’ అని తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్ఠానం కమిటీ వేశాక.. రాష్ట్రంలో తన వైఫల్యం లేదని చూపించుకునేందుకే.. రేవంత్‌రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి తీసుకువెళ్తున్నారని ఆరోపించారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పును రేవంత్ తన తప్పును సరిదిద్దుకోలేరన్నారు. బీజేపీ వైఖరి వల్ల దేశం రెండుగా చీలిపోయిందని, ఈ కీలక సమయంలో కాంగ్రెస్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిందన్నారు.