Burra Venkatesham: టీజీపీఎస్సీపై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయండి
ABN , Publish Date - Dec 15 , 2024 | 04:30 AM
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుందని ఆ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు.
ఇకపై నోటిఫికేషన్ నుంచి.. ఏడాదిలోగా నియామకాల పూర్తి
వేగంగా ఫలితాలకు చర్యలు
మార్చిలోగా గ్రూప్-2, 3 ఫలితాలు
నేటి నుంచి గ్రూప్-2 పరీక్షలు
1,368 పరీక్ష కేంద్రాలు.. 5.51 లక్షల మంది అభ్యర్థులు
అరగంట ముందే గేట్ల మూసివేత
బయోమెట్రిక్ వేస్తేనే పరీక్షకు అనుమతి
టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ)పై విశ్వాసం ఉంచి పరీక్షలు రాయాలని.. మెరిట్ ఉంటే ఉద్యోగం వస్తుందని ఆ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అన్నారు. గతంలో గ్రూప్-2 నోటిఫికేషన్‌ను 2015లో విడుదల చేస్తే.. 2019లో నియామకాలు జరిగాయని, ఇకపై టీజీపీఎస్సీలో అలాంటి ఆలస్యం ఉండబోదన్నారు. నోటిఫికేషన్లు ఇచ్చిన నాటి నుంచి 9-12 నెలల మధ్యలో నియామకాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న గ్రూప్-2తోపాటు.. ఇదివరకే నిర్వహించిన గ్రూప్-3 ఫలితాలను మార్చిలోగా విడుదల చేస్తామని భరోసా ఇచ్చారు. శనివారం ఆయన కమిషన్ సభ్యుడు రామ్మోహన్‌రావుతో కలిసి, విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా 783 పోస్టుల భర్తీకి నిర్వహిస్తున్న గ్రూప్-2 పరీక్షలకు సర్వం సిద్ధమైందని, ఆది, సోమవారాల్లో 1,368 కేంద్రాల్లో నిర్వహించనున్న ఈ పరీక్షలకు 5,51,847 మందిహాజరుకానున్నారని వివరించారు. ‘‘ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు.. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండేసి సెషన్లలో రెండ్రోజుల్లో నాలుగు పేపర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి.
ఉదయం సెషన్‌లో 9.30లోపు.. మధ్యాహ్నం 2.30లోపు అభ్యర్థులు పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాలి. ఆ తర్వాత గేట్లను మూసివేస్తాం’’ అని స్పష్టంచేశారు. ‘‘2022లో గ్రూప్-2 నోటిఫికేషన్ వెలువడింది. రెండు కోర్టు కేసులతో.. రెండేళ్ల తర్వాత పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా 75ు మంది హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకున్నారు. 80ు మంది దాకా అభ్యర్థులు పరీక్షలు రాసే అవకాశాలున్నాయి. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సిలబస్ నుంచే ప్రశ్నలుంటాయి. ఏ పుస్తకాలను చదవాలనేది అభ్యర్థుల ఇష్టం’’ అని వివరించారు. గ్రూప్-2 ఓఎంఆర్ షీట్లు అభ్యర్థుల వారీగా ఉంటాయని, పరీక్ష ప్రారంభం కావడానికి ముందే అందులోని వివరాలను పరిశీలించుకోవాలని సూచించారు. బయోమెట్రిక్ హాజరు ఉన్న అభ్యర్థుల పత్రాలను మాత్రమే వాల్యుయేషన్‌కు పంపుతామని స్పష్టం చేశారు. ‘‘తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇది రెండో గ్రూప్-2 నోటిఫికేషన్. 2022లో రెండో నోటిఫికేషన్ వస్తే.. 2024లో పరీక్షలు పెడుతున్నాం. మార్చిలోగా గ్రూప్-2, గ్రూప్-3 ఫలితాలను విడుదల చేస్తాం’’ అని వెల్లడించారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ)పై బుర్రా వెంకటేశం మాట్లాడుతూ.. రాష్ట్రంలో 28 వేల మంది అభ్యర్థులు మాత్రమే సీబీటీ విధానంలో పరీక్షలు రాసే సదుపాయాలున్నాయన్నారు. అందుకే తాము సీబీటీ జోలికి వెళ్లడం లేదన్నారు.
యూపీఎస్సీకి దీటుగా టీజీపీఎస్సీ
యూపీఎస్సీకి దీటుగా టీజీపీఎస్సీని తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు బుర్రా వెంకటేశం తెలిపారు. ఇందుకోసం 18, 19వ తేదీల్లో ఢిల్లీలో పర్యటిస్తామన్నారు. ‘‘18న యూపీఎస్సీ చైర్మన్‌ను కలిసి పరీక్ష, నియామక ప్రక్రియను పరిశీలిస్తాం. కేంద్ర సమాచార కమిషన్ ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియాను కలిసి, సమాచార హక్కు చట్టం కింద ఏయే సమాచారం ఇవ్వాలి? వంటి వివరాలపై అధ్యయనం చేస్తాం. 19న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎ్‌సఎ్‌ససీ) చైర్మన్‌ను, ఆ తర్వాత జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్‌టీఏ) చైర్మన్‌ను కలుస్తాం. సంస్థాగత మార్పులు, సంస్కరణలపై 2025 జనవరి నెలాఖరుకల్లా ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. ఈ ఏడాదిలో 13 వేల ఉద్యోగాలను తెలంగాణ కమిషన్ భర్తీ చేసింది. ఏడాదిలో యూపీఎస్సీ 5 వేల ఉద్యోగాలను మాత్రమే భర్తీ చేస్తుంది. యూపీఎస్సీ కేవలం సివిల్స్ పరీక్షలను నిర్వహించి, మిగిలిన ప్రక్రియలను ఎస్‌ఎ్‌ససీకి అప్పగిస్తుంది’’ అని వివరించారు. ఏ పరీక్షకు నోటిఫికేషన్‌ను విడుదల చేసినా.. పరీక్షలు, సర్టిఫికెట్‌ల వెరిఫికేషన్, నియామక ప్రక్రియను 9 నెలల నుంచి ఏడాదిలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.