By-election: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికపై చర్చ
ABN , Publish Date - Feb 24 , 2024 | 11:58 AM
సిట్టింగ్ శాసనసభ్యురాలు లాస్యనందిత(Lasyanandita) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సికింద్రాబాద్: సిట్టింగ్ శాసనసభ్యురాలు లాస్యనందిత(Lasyanandita) రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సభ్యులెవరైనా మరణిస్తే ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాలని నిబంధన ఉంది. అయితే, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ మరో 15 రోజుల్లో వెలువడనున్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వాటితోపాటే కంటోన్మెంట్ ఉపఎన్నిక నిర్వహణ సాధ్యమా, కాదా.. అనే విషయమై స్థానికంగా తర్జనభర్జనలు పడుతున్నారు. లోక్‌సభ ఎన్నికల నిర్వహణపై ఈపాటికే అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించిన సంగతి విదితమే. ఇప్పటికిప్పుడే అసెంబ్లీ స్పీకర్ నుంచి రాష్ట్ర సీఈఓకు కంటోన్మెంట్ సీటు ఖాళీ అయ్యిందంటూ అధికారికంగా సమాచారం పంపడం, అక్కడి నుంచి కేంద్ర ఎన్నికల కార్యాలయానికి ఈ సమాచారం అందవలసి ఉంటుందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యేలోపు ఈ ప్రక్రియ పూర్తయితే లోక్‌సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ ఉపఎన్నిక సాధ్యమవుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రత్యేక షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.