CM Revanth : అది నిరూపిస్తే.. ఢిల్లీ నడిబజార్‌లో క్షమాపణ చెబుతా.. సీఎం సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Dec 07 , 2024 | 07:15 PM
నల్గొండ కాంగ్రెస్ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తాము ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడైనా ఇస్తే.. ఢిల్లీ నడిబజార్ లో వచ్చి క్షమాపణ చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే మా అడ్డాకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడొద్దని కేంద్ర మంత్రి నడ్డాను హెచ్చరించారు.
CM Revanth: నల్గొండ కాంగ్రెస్ విజయోత్సవ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీకి సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తాము ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడైనా ఇస్తే.. ఢిల్లీ నడిబజార్ లో వచ్చి క్షమాపణ చెబుతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే మొదటి ఏడాదిలో 55వేల 143 ఉద్యోగాలు ఇచ్చింది ఒక్క తెలంగాణలోనేనని అన్నారు. ఈ క్రమంలోనే మా అడ్డాకు వచ్చి అడ్డగోలుగా మాట్లాడొద్దని కేంద్ర మంత్రి నడ్డాను హెచ్చరించారు. ఎడాదిలో 21కోట్లతో రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మా కాంగ్రెస్ పార్టీదని అన్నారు. ఒక్క నల్గొండ జిల్లాలోనే 2004 కోట్ల రుణమాఫీ జరిగిందని.. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ పార్టీదేనని చెప్పుకొచ్చారు. 24గంటల కరెంట్ ఇచ్చి 50లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. రోజు 18గంటలు పనిచేస్తున్నామని.. అయితే, సోషల్ మీడియాలో అడ్డగోలుగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
6500కోట్లు వడ్డీ..
16వేల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కేసీఆర్ 7లక్షల కోట్ల అప్పు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము నెలకు 6500కోట్లు వడ్డీ కడుతున్నామని అన్నారు. సంక్రాంతి తర్వాత ఖచ్చితంగా రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారు. సన్నాలే పండించండి.. 500 బోనస్ ఇస్తాం.. చివరి గింజ వరకు కొంటాం అని వ్యాఖ్యానించారు. రేషన్ దుకాణాల్లో, హాస్టల్ విద్యార్థులకు మీరు పండించిన సన్నాలతోనే అన్నం పెడతామని అన్నారు. నల్గొండకు 400కోట్లతో రింగ్ రోడ్డు, 35వేల కోట్లతో రీజనల్ రింగ్ రోడ్డు, 50వేల ఎకరాల్లో కొత్త నగరాన్ని నిర్మిస్తామని వెల్లడించారు.
మూసీ ప్రక్షాళన చేసి తీరుతాం..
మూసీ కాలుష్యాన్ని ప్రక్షాళన చేసి తీరుతామంటే బీ ఆర్ ఎస్ అడ్డుపడుతోందని వివరించారు. మూసీ అడ్డుకునే ఏక లింగాన్ని మూసీలో ముంచండి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటల నల్గొండ జిల్లా ప్రజలే మూసీ ప్రక్షాళనకు అడ్డువచ్చే వారిని చూసుకోవాలి అంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామంటూ.. పునరుజ్జీవనం చేసి గోదావరి జలాలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ మూసీ ప్రక్షాళన వద్దంటే బీ ఆర్ ఎస్ పార్టీ ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
ప్రతిపక్ష హోదా పోషించాడా?..
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా కేసీఆర్ ఏనాడైనా ప్రతిపక్ష హోదా పోషించాడా? నలభై ఏళ్ల ప్రజా పాలనలో ఉన్న కేసీఆర్ ప్రతిపక్ష హోదా సీటు ఖాళీగా ఉంచుతారా? మా నాయకులు... మేము ఓడినా ప్రజల్లో ఉన్నామన్నారు. కేసీఆర్ ఆత్మ పరిశీలన చేసుకోవాలి.. ఎందుకు బయటికి రావడం లేదు? అభివృద్ధి పనులు అడ్డుకునేలా గాలి బ్యాచ్ ను వదిలి ఏం మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు.