CM Revanth Reddy: ఆ మాటకు కట్టుబడి ఉన్నాం..
ABN , Publish Date - Nov 26 , 2024 | 03:42 PM
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీ: తెలంగాణలో ఇచ్చిన మాట ప్రకారం కుల గణన చేపడుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సంవిధాన్ రక్షణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, దళితులకు, ఆదివాసులకు భూ చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. భారత్ జోడో యాత్ర పేరిట రాహుల్ గాంధీ అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి ఇబ్బందులు తెలుసుకున్నారని అన్నారు.
రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణలో రిజర్వేషన్లు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా కుల గణన చేపట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు గాంధీ పరివార్ ఉందని.. రాహుల్ గాంధీకి అండగా తాము ఉన్నామని వ్యాఖ్యానించారు. రైతుల తరఫున నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ అందోళన చేశారని.. అందుకే కేంద్రం నల్ల చట్టాలను వెనక్కి తీసుకుందని వివరించారు.
ప్రతిష్ఠాత్మకంగా కులగణన..
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా కులగణన చేపట్టింది. కొన్ని చోట్ల ఇప్పటికే ప్రజల నుండి వివరాలు నమోదు చేసుకుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు క్షేత్రస్థాయిలో సర్వేను పర్యవేక్షిస్తూ సర్వే సిబ్బందికి మార్గనిర్దేశం చేస్తున్నారు. సర్వేలో మొత్తం 85 వేల మంది ఎన్యుమరేటర్లు, 8,500 మంది సూపర్వైజర్లు పాల్గొంటున్నారు. ఇంటి నంబరు, యజమాని పేరు నమోదు చేసే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు పాల్గొంటున్నారు. ప్రతి కుటుంబంలో సభ్యులందరి ఫోన్, ఆధార్ నంబర్లు సహా సమస్త వివరాలతో కూడిన 75 ప్రశ్నలను అడిగి నమోదు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,17,44,954 కుటుంబాలున్నాయని.. ఇళ్లను 87,092 ఎన్యూమరేషన్ బ్లాక్‌లుగా విభజించి కులగణన చేపట్టినట్లు రాష్ట్ర ప్రణాళిక శాఖ తెలిపారు.