Share News

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి.. గుజరాత్‌ గులామ్‌

ABN , Publish Date - Nov 18 , 2024 | 03:21 AM

ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌ తరహాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా గుజరాత్‌కు గులాముగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

CM Revanth Reddy: కిషన్‌రెడ్డి.. గుజరాత్‌ గులామ్‌

  • సబర్మతి మాదిరిగా మూసీ ఆయనకు ఎందుకు కనిపించదు?

  • గుజరాత్‌ మోడల్‌ విఫలమవుతుందనే చెడగొట్టే యత్నం

  • బీజేపీ నేతలు ఏదైనా చేసుకోనివ్వండి.. ప్రక్షాళన చేసి తీరుతాం

  • వీరుల గడ్డలో విద్రోహులు శిందే, అజిత్‌, అశోక్‌ చవాన్‌

  • అబద్ధాల పోటీలో ప్రధాని మోదీ నంబర్‌ వన్‌: సీఎం రేవంత్‌

  • మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభల్లో మళ్లీ వాహనం తనిఖీ

హైదరాబాద్‌, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌ తరహాలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కూడా గుజరాత్‌కు గులాముగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో మోదీ.. సబర్మతీ రివర్‌ ఫ్రంట్‌ను ఏర్పాటు చేసి 50 వేల మంది పైగా ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలిస్తే చప్పట్లు కొట్టిన కిషన్‌రెడ్డి గుజరాత్‌ మోడల్‌ చాలా బాగుందంటూ ప్రపంచం మొత్తం చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని.. తెలంగాణ రైజింగ్‌ మోడల్‌లో భాగంగా మూసీ పునరుద్ధరణ కార్యక్రమం చేపడితే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్‌ మోడల్‌కు తెలంగాణ రైజింగ్‌ అన్నది కౌంటర్‌ మోడల్‌ అన్నారు. ఈ కాంగ్రెస్‌ మోడల్‌ దేశం మొత్తం తెలిస్తే గుజరాత్‌ మోడల్‌ విఫలమవుతుదనే దాన్ని చెడగొట్టే ప్రయత్నం కిషన్‌రెడ్డి చేస్తున్నారని ఆరోపించారు. గంగా నది ప్రక్షాళన, సబర్మతీ రివర్‌ఫ్రంట్‌లను ఏర్పాటు చేస్తే కిషన్‌రెడ్డికి బాగా కనిపిస్తుంది కానీ.. మూసీ ప్రక్షాలన మాత్రం మంచిగ కనిపించదన్నారు. వారు ఏది చేసుకున్నా మూసీ ప్రక్షాళన మాత్రం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆదివారం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో, ఏఎన్‌ఐ వార్తా సంస్థతో మాట్లాడారు.


ఛత్రపతి శివాజీ, జ్యోతి బాపూలే, బీఆర్‌ అంబేడ్కర్‌, బాలా సాహెబ్‌, శరద్‌ పవార్‌ వంటి యోధుల నేలలో ఇప్పుడు ఏక్‌నాథ్‌ శిందే, అజిత్‌ పవార్‌, అశోక్‌ చవాన్‌ వంటి విద్రోహులు తయారయ్యారని మండిపడ్డారు. వారు గుజరాత్‌ గులాంలుగా మారారని విమర్శించారు. అబద్ధాల పోటీలు పెడితే దేశంలో నంబర్‌వన్‌గా ప్రధాని నరేంద్ర మోదీ నిలుస్తారని ఎద్దేవా చేశారు. ఆటో డ్రైవర్‌గా ఉన్న ఏక్‌నాథ్‌ శిందేను మం త్రి వరకు బాలాసాహెబ్‌ కుటుంబం తీసుకొచ్చిందని గుర్తు చేశారు. సొంత కుమార్తెను కాదని అజిత్‌ పవార్‌ను శరద్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రి చేశారని, అలాగే.. అశోక్‌ చవాన్‌... ఆయన తండ్రి శంకర్‌రావు చౌహాన్‌లను కాంగ్రెస్‌.. మహారాష్ట్రకు సీఎంలుగా చేసిందన్నారు. ఇప్పుడు వారు ముగ్గురూ విద్రోహులుగా మారి వీరుల నేలను అవమానాలపాలు చేశారని ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో తమ ప్రభుత్వం 50 రోజుల్లోనే రూ.18 వేల కోట్లను రుణమాఫీ చేసిందని చెప్పారు. మహారాష్ట్రలో కాంగ్రె్‌సను గెలిపిస్తే రైతులకు రూ.3 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో రుణమాఫీతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. రూ.500కే సిలిండర్‌.. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేస్తున్న నయాగామ్‌ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థి మీనల్‌ పాటిల్‌ ఖత్‌గావ్‌కర్‌, భోకర్‌ అభ్యర్థి తిరుపతి కదమ్‌ కొందేకర్‌, దక్షిణ సోలాపూర్‌ అభ్యర్థి చేతన్‌ నరొటే, నాందేడ్‌ లోక్‌సభ ఉప ఎన్నికకు సంబంధించి అభ్యర్థి రవీంద్ర చౌహాన్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.


  • మళ్లీ రేవంత్‌ వాహనం తనిఖీ

మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా భోకర్‌ నియోకవర్గంలో పర్యటిస్తున్న సీఎం రేవంత్‌ కాన్వాయ్‌ను ఆపి వాహనాలను ఆ రాష్ట్ర పోలీసులు ఆదివారం తనిఖీ నిర్వహించారు. శనివారం కూడా ఓ బహిరంగ సభలో పాల్గొనేందుకు వెళ్తుండగా రేవంత్‌ కాన్వాయ్‌ని పోలీసులు తనిఖీ చేశారు.

Updated Date - Nov 18 , 2024 | 03:21 AM