CM Revanth Reddy: నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. త్వరలోనే ఉద్యోగాల భర్తీ
ABN , Publish Date - Jan 31 , 2024 | 08:13 PM
నిరుద్యోగ యువతీ యువకులకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తాము త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉన్నామని.. ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు.
నిరుద్యోగ యువతీ యువకులకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం తాము త్వరలోనే ఉద్యోగాల భర్తీ చేపడతామని హామీ ఇచ్చారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు తాము కట్టుబడి ఉన్నామని.. ఏడాదిలోగా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని పునరుద్ఘాటించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నర్సింగ్ ఆఫీసర్స్‌కు నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో భాగంగా.. ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసేందుకు నిరుద్యోగ యువతీ యువకులే కారణమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరుద్యోగులకు ఒరిగిందేమీ లేదని తూర్పారపట్టారు. తమ కుటుంబ సభ్యులకు పదవుల గురించి తప్ప.. రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం చేయాలనే ఆలోచన వాళ్లు చేయలేదని విమర్శించారు. అయితే.. ఎన్నికల తర్వాత వాళ్ల ఉద్యోగాలు ఊడగొట్టగానే, మీకు (నిరుద్యోగులు) ఉద్యోగాలు వచ్చాయన్నారు. తాము ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ప్రయత్నిస్తుంటే.. తమ ప్రభుత్వంపై హరీష్ రావు శాపనార్థాలు పెడుతున్నాడని, అయితే పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదని కౌంటర్ ఇచ్చారు.
అవాకులు చెవాకులు పలకడం కాదని.. ఒక్కసారి ఇక్కడున్న పేదోళ్ల బిడ్డల కళ్లలో ఆనందం చూడండని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్.. మీరైనా పిలిచి, మీ అల్లుడికి గడ్డి పెట్టండని హితవు పలికారు. తమ కాంగ్రెస్ ప్రభుత్వం టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేసి.. కొత్త చైర్మన్, సభ్యులను నియమించిందని గుర్తు చేశారు. త్వరలోనే తాము ఉద్యోగాల భర్తీ చేపడతామని ఈ వేదిక నుంచి మాటిస్తున్నానన్నారు. మీ కళ్ళల్లో ఆనందం చూసి, ఫామ్‌హౌస్‌లో ఉన్నవాళ్లు కుళ్లుకున్నా, కడుపులో దుఃఖం పొంగుకొచ్చినా.. ఉద్యోగా భర్తీ ఏమాత్రం ఆగదని తెగేసి చెప్పారు.