Share News

CM Revanth Reddy: రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో వెలుగు

ABN , Publish Date - Dec 01 , 2024 | 03:12 AM

‘ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్‌ మాత్రమే కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం.

CM Revanth Reddy: రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో వెలుగు

  • నిరుడు ఇదే రోజు మార్పు కోసం ఓటేశారు

  • ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసింది: సీఎం

  • ఏడాది కింద ఇదే రోజు మార్పు కోసం ఓటు

  • ఆ ఓటే రైతన్న చరిత్ర తిరగరాసింది: సీఎం

  • రేపు ట్రాన్స్‌ క్లినిక్‌ల ప్రారంభం

హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ‘ఒక్క ఏడాదిలో రూ.54 వేల కోట్లతో రైతుల జీవితాల్లో పండుగ తెచ్చాం. ఇది నంబర్‌ మాత్రమే కాదు.. రైతులు మాపై పెట్టుకున్న నమ్మకం. ఈ సంతోష సమయంలో అన్నదాతలతో కలిసి రైతు పండుగలో పాలుపంచుకోవడానికి ఉమ్మడి పాలమూరుకు వస్తున్నా’ అంటూ మహాబూబ్‌నగర్‌ రైతు సభకు వెళ్లడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ, రూ.7,625 కోట్లతో రైతు భరోసా, సన్నధాన్యానికి క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, ఉచిత విద్యుత్తు కింద రూ.10,444 కోట్లు, రూ.1,433 కోట్లతో రైతు బీమా, రూ.95 కోట్ల పంట నష్టపరిహారం, రూ.10,547 కోట్లతో ధాన్యం కొనుగోలుకు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు.


ఏడాది క్రితం సరిగ్గా ఇదేరోజు (నవంబర్‌ 29) పొలానికి వెళ్లి అరక కట్టాల్సిన రైతు.. పోలింగ్‌ బూత్‌కు వెళ్లి ‘మార్పు’ కోసం ఓటేశాడని, ఆ ఓటే అభయహస్తమై.. రైతన్న చరిత్రను తిరగరాసిందంటూ వ్యాఖ్యానించారు. కాగా, తుర్కియే, ఆస్ట్రియా దేశ రాయబారులు కేథరినా వేజర్‌, ఫిరాట్‌ సునెల్‌ జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేథరినా.. సీఎంకు ఒక పెయింటింగ్‌ను బహూకరించారు. వీరి వెంట మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు. కాగా, ట్రాన్స్‌జెండర్ల కోసం మైత్రి పేరుతో ప్రత్యేక ట్రాన్స్‌ క్లినిక్‌లను సోమవారం సీఎం రేవంత్‌ వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు. జిల్లా ఆసుపత్రుల్లోనే వీరి కోసం ప్రత్యేక విభాగాన్ని అందుబాటులోకి తెస్తున్నారు.

Updated Date - Dec 01 , 2024 | 03:12 AM