Share News

CM Revanth Reddy: ప్రభుత్వ విజయాలు తెలిసేలా.. ప్రజాపాలన విజయోత్సవాలు

ABN , Publish Date - Nov 15 , 2024 | 03:52 AM

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబరు 7నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు.

CM Revanth Reddy: ప్రభుత్వ విజయాలు తెలిసేలా.. ప్రజాపాలన విజయోత్సవాలు

  • వచ్చే నెల 9దాకా కార్యక్రమాలు

హైదరాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబరు 7నాటికి ఏడాది పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్ణయించారు. అలాగే, వరంగల్‌, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌ జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే, డిసెంబరు 9న సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ నెల 19న వరంగల్‌ వేదికగా 22 జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణ, పర్యవేక్షణ సహా వివిధ అంశాలపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ముఖ్యమంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు.


ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్‌, శ్రీధర్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా గురువారం(నవంబరు 14) నుంచి డిసెంబరు 9 వరకు నిర్వహించే కార్యక్రమాల వివరాలను అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన కార్యక్రమాలు ప్రజలకు అర్థమయ్యేలా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించారు. డిసెంబరు 7, 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌, సచివాలయం, నెక్లెస్‌ రోడ్‌ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలిపారు. కాగా, నవంబరు 19, 25, 30 తేదీలు, డిసెంబరు 7, 8, 9 తేదీల్లో నిర్వహించే వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమీక్షలో నిర్ణయించినట్టు తెలిసింది.

Updated Date - Nov 15 , 2024 | 03:52 AM