CM Revanth Reddy: ప్రభుత్వ పథకాల్లో మీ వాటా- మీ కోటా
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:52 AM
క్రైస్తవ సమాజానికి తెలంగాణ ప్రభుత్వంలో సముచిత స్ధానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కమిటీలోలనూ ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు.
క్రిస్టియన్లకు సర్కారులో సముచిత స్థానం
అన్ని మతాలకు సమాన ఆదరణ
చిచ్చుపెడితే సహించేది లేదు.. చర్చిల అభివృద్ధికి ప్రాధాన్యం
క్రిస్మస్ ఉత్సవాల్లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన
హైదరాబాద్, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): క్రైస్తవ సమాజానికి తెలంగాణ ప్రభుత్వంలో సముచిత స్ధానం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాంగ్రెస్ కమిటీలోలనూ ప్రాధాన్యం ఇస్తామని హామీ ఇచ్చారు. లాల్ బహదూర్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా చిన్నారులకు క్రిస్మస్ కానుకలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజంలోని దళిత క్రిస్టియన్ల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఇందిరమ్మ ఇళ్లతో సహ ప్రతి ప్రభుత్వ పధకంలో మీ వాటా-మీ కోటా ఉంటుందని హమీ ఇచ్చారు. పార్టీలో చురుకైన క్రిస్టియన్ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వాలని సభకు హజరైన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు సూచించారు. విద్యా,వైద్య రంగాల్లో క్రిస్టియన్ సంస్దలు చేస్తున్న సేవలను గుర్తు చేశారు.
సంక్రాంతి తర్వాత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు ప్రక్రియ మొదలవుతుందని, ఇందులో నిరుపేద దళితులు, దళిత క్రిస్టియన్లకు లబ్ధి కలుగుతుందని చెప్పారు. సర్వమతాలు సమానంగా ఉండాలని తాను కోరుకుంటానని, ఏ మతాన్ని ఆచరించినా, విశ్వసించినా పూర్తి రక్షణ కల్పిస్తామని ప్రకటించారు. మతాల మధ్య చిచ్చు రేపితే సహించేది లేదని హెచ్చరించారు. తెలంగాణలోని చారిత్రాత్మక చర్చిల అభివృద్ధి పునర్మిణానికి తగినంత నిధులు కేటాయిస్తామని అన్నారు. డిసెంబర్ నెల ‘మిరాకిల్ మంత్’ అని, ఏసు ప్రభువు జన్మించిన మాసం, సోనియా గాంధీ పుట్టిన నెల, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించిన నెల అని వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.