CM Revanth Reddy: చెప్పుకోవడానికి సక్సెస్ స్టోరీల్లేక.. అబద్ధాల ప్రచారం
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:53 AM
తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలపైన మహారాష్ట్ర బీజేపీ నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్పుకోవడానికి మోదీ మొదలుకుని ఆ రాష్ట్ర బీజేపీ నేతల వరకు ఎవరికీ సక్సెస్ స్టోరీ ఏదీ లేదన్నారు.
కాంగ్రెస్ గ్యారెంటీలపై మోదీవన్నీ అబద్ధాలే
ఆపకుంటే నిజాలు మాట్లాడుతూనే ఉంటా
రుణమాఫీపై మోదీ ఆరోపణలకు బదులిచ్చా
దాంతో ఆయన ఎక్స్ పోస్టునే తొలగించారు
జాతీయ జనగణనలో కులగణన చేర్చాల్సిందే
రాష్ట్రంలో పూర్తి చేసి మోదీని సవాల్ చేస్తాం
వీరుల గడ్డ మహారాష్ట్రలో గుజరాత్ గులాంలా?
డీకే, సుక్కులతో కలిసి ముంబైలో సీఎం రేవంత్ ప్రెస్‌మీట్.. బీజేపీ ప్రచారానికి కౌంటర్
హైదరాబాద్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కాంగ్రెస్ గ్యారెంటీలపైన మహారాష్ట్ర బీజేపీ నేతలు, ప్రధాని నరేంద్ర మోదీ అడ్డగోలుగా అబద్ధాలు చెబుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మహారాష్ట్ర ఎన్నికల్లో చెప్పుకోవడానికి మోదీ మొదలుకుని ఆ రాష్ట్ర బీజేపీ నేతల వరకు ఎవరికీ సక్సెస్ స్టోరీ ఏదీ లేదన్నారు. చెప్పుకోవడానికి ఏమీ లేనప్పుడు ఇతరులపై నిందలు మోపి, గెలిచే ప్రయత్నం చేయడం మోదీకి అలవాటని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన అదే చేస్తున్నారన్నారు. మోదీ అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే.. తాను నిజాలు చెప్పడమూ మానబోనని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికల హామీలను అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైందని, మహారాష్ట్రలో ఆ పార్టీ నేతృత్వంలోని కూటమి మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఐదు గ్యారెంటీలు కూడా అమలు చేసేవి కాదని బీజేపీ ఉధృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో దీన్ని తిప్పికొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, హిమాచల్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్‌సింగ్ సుక్కు రంగంలోకి దిగారు.
ముగ్గురూ ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలనూ క్రమ పద్ధతిలో అమలు చేస్తూ వస్తున్నామని, ఆ వివరాలను మహారాష్ట్ర ప్రజల ముందు ఉంచడం తన బాధ్యతగా భావించి ఇక్కడికి వచ్చానని చెప్పారు. ‘‘కులగణనను రాహుల్‌గాంధీ ఎక్స్‌రేతో పోల్చారు. ఆ ఎక్స్‌రేను నేను మెగా ఫ్యామిలీ హెల్త్ చెకప్ వరకూ విస్తరించాలని అనుకుంటున్నాను’’ అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో శుక్రవారం మొదలు పెట్టిన కులగణనను నెల రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. 4 కోట్ల మంది ప్రజల సమగ్ర వివరాలను సేకరించి, ఇదే రీతిన కులగణన చేపట్టాలని ప్రధాని మోదీకి సవాల్ చేస్తామన్నారు. 2025 జనవరి నుంచి దేశవ్యాప్తంగా చేపట్టనున్న జనగనణ కార్యక్రమంలో కులగణననూ చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీర్మానం కూడా చేశామన్నారు.
అంబానీ, అదానీలకు రైతుల్ని అప్పగించే కుట్ర
గడిచిన పదేళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేసింది ఏమీ లేదని రేవంత్‌రెడ్డి అన్నారు. పంటలకు మద్దతు ధర ఇవ్వకపోగా నల్ల చట్టాలు తీసుకువచ్చి అమెజాన్, అంబానీ, అదానీలకు రైతుల భవిష్యత్తును అప్పగించే కుట్రకు మోదీ పాల్పడ్డారని ముఖ్యమంత్రి ఆరోపించారు. సొంత రాజకీయ ప్రయోజనాల కోసం హామీలిచ్చే అలవాటు సోనియాగాంధీ కుటుంబానికి లేదని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఇచ్చిన హామీని ఎట్టి పరిస్థితుల్లో అమలు చేసి తీరుతుందన్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా, 25 రోజుల వ్యవధిలో 22,22,067 మంది రైతులకు రూ.17,869 కోట్ల రుణం మాఫీ చేశామని వెల్లడించారు. దీనికి సంబంధించి ఎవరికైనా వివరాలు కావాలంటే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.
తెలంగాణ రుణమాఫీకి సంబంధించి ట్విటర్ వేదికగా ప్రధాని మోదీ చేసిన విమర్శలకు పూర్తి వివరాలతో తాను సమాధానం ఇచ్చానన్నారు. దాంతో ఆ విమర్శలను మోదీ తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. గత పదేళ్లుగా బీజేపీతో దోస్తీ చేస్తున్న బీఆర్‌ఎస్ యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు. దీనికి సంబంధించి బీజేపీ గానీ, ఏక్‌నాథ్‌షిండే గానీ, అజిత్ పవార్‌లు గానీ తెలంగాణకు వస్తే పూర్తి వివరాలను అందజేస్తామని రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మహాలక్ష్మీ పథకం ద్వారా 49 లక్షల కుటుంబాలకు రూ.500లకే గ్యాస్ సిలెండర్ అందిస్తున్నామని, 50 లక్షల కుటుంబాలు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ద్వారా లబ్ది పొందుతున్నాయని వివరించారు. వరికి మద్దతు ధరపై రూ.500 బోనస్ ఇస్తున్నామన్నారు. గత పది నెలల్లో 1.04 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని, ఇందుకుగాను ఆర్టీసీకి రూ.3,541 కోట్లు చెల్లించామని వివరించారు.
వీరుల గడ్డలో గుజరాత్‌కు గులాములా?
మహారాష్ట్ర అంటే ఛత్రపతి శివాజీ, జ్యోతిబా పూలే, అంబేద్కర్, థాకరే, శరద్ పవార్ గుర్తుకు వస్తారని, ఎందరో వీరులకు జన్మనిచ్చిన ఈ గడ్డలో గుజరాత్‌కు గులాములు అయిపోయిన ఏకనాథ్ షిండే, అజిత్ పవార్‌లు ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్రకు రావాల్సిన 17 మెగా పెట్టుబడులను ప్రధాని మోదీ గుజరాత్‌కు తరలించుకు పోయారని ఆరోపించారు. మహారాష్ట్ర ప్రజలు సత్తా చూపించాలని, రాష్ట్రాన్ని మోసం చేసిన బీజేపీని మట్టి కరిపించాలని రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మాట్లాడుతూ, బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి నేతలు కర్ణాటకకు వచ్చి ఐదు గ్యారెంటీలు ఎలా అమలు అవుతున్నాయో చూసుకోవచ్చని చెప్పారు. గ్యారెంటీలకు ముందు కర్ణాటక జీడీపీ 8.2 కాగా ప్రస్తుతం 10.2కు పెరిగిందని, ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చిన గణాంకాలేనని వివరించారు. గ్యారెంటీలపై బీజేపీ తప్పుడు ప్రకటనలపై న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. గ్యారెంటీలకు ఏటా రూ.52 వేల కోట్లు ఖర్చు అంచనా వేశామని, అదనంగా రూ.4 వేల కోట్లు అవుతోందని వివరించారు. ఉద్యోగులకు పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని హిమాచల్ సీఎం సుఖ్వీందర్‌సింగ్ ప్రస్తావించారు.
చంచల్‌గూడ పర్యటనకు సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం చంచల్‌గూడలోని జైళ్ల శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సీఎం పర్యటనకు దాదాపు షెడ్యూల్ ఖరారైనట్లు తెలిసింది. శిక్షణ పూర్తి చేసుకున్న వార్డన్‌ల పాసింగ్ అవుట్ పరేడ్‌కు సీఎం ముఖ్య అతిధిగా హాజరై గౌరవ వందనం స్వీకరిస్తారు. జైలు ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన పెట్రోల్ పంపును ప్రారంభిస్తారు. జైల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డి అడిక్షన్ కేంద్రాన్ని ప్రారంభిస్తారు. కాగా, మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం వ్యక్తం చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. జ్యోతి మరణం పట్ల స్పీకర్ ప్రసాద్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కు గౌడ్ సంతాపం తెలిపారు.