Harish Rao: మూసీ కంపు కంటే రేవంత్ నోటి కంపే ఎక్కువ
ABN , Publish Date - Nov 10 , 2024 | 02:09 AM
‘‘మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపే ఎక్కువగా ఉంది. సినిమాలకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు.. సీఎం రేవంత్ బూతులు వింటుంటే రాజకీయాల్లో కూడా నేతల ప్రసంగాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నేతల మాటలకు సెన్సార్ ఉండాలి
కేసీఆర్‌ను మూడుముక్కలు చేస్తారా?
మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్
మెదక్/నర్సాపూర్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ‘‘మూసీ మురికి కంటే రేవంత్ నోటి కంపే ఎక్కువగా ఉంది. సినిమాలకు సెన్సార్ బోర్డు ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చినట్లు.. సీఎం రేవంత్ బూతులు వింటుంటే రాజకీయాల్లో కూడా నేతల ప్రసంగాలకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మంత్రి హోదాలో ఉన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా మాజీ సీఎం కేసీఆర్‌ను చంపి మూడు ముక్కలు చేసి, మూసీలో వేస్తామని అనడం దారుణం. పోలీసులు ఈ వ్యాఖ్యలను ఎలాగూ పట్టించుకోరు.. కనీసం గవర్నర్ అయినా పట్టించుకుని మంత్రిని బర్తరఫ్ చేయాలి’’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు డిమాండ్ చేశారు. శనివారం మెదక్ జిల్లా కొల్చారంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు దీక్షలో, అంతకుముందు విలేకరులతో హరీశ్ రావు మాట్లాడారు.
సీఎం కేసీఆర్ రైతుపక్షపాతిగా పేరుగడిస్తే, రేవంత్‌రెడ్డి బూతుల సీఎంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజా విజయోత్సవాలు జరపాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునివ్వడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రైతుబంధు ఎగ్గొట్టినందుకు విజయోత్సవాలా? మహిళలకు రూ.2500 ఇవ్వనందుకా.. ఒక్క ఇల్లు కూడా ఇవ్వకండా ఉన్న ఇళ్లు కూల్చినందుకా? అని ప్రశ్నించారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేతలు తెలంగాణాలో ఆరు హామీలు అమలు చేశామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నానని, తాను హైదరాబాద్‌లో కలిసి పాదయాత్ర చేయడానికి సిద్ధమని చెప్పారు.