CM Revanth Reddy: 8న మూసీ బాట
ABN , Publish Date - Nov 05 , 2024 | 03:40 AM
మూసీ నది పునరుజ్జీవం విషయంలో ముందుకే వెళతామంటూ ఇటీవల స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు.
పుట్టినరోజున నది పరీవాహక గ్రామాల్లో సీఎం రేవంత్ పాదయాత్ర
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుడి దర్శనం
తర్వాత యాదాద్రి జిల్లా మూసీ కాలుష్య బాధిత రైతులతో మాటా-ముచ్చట
నాగారం నుంచి ఇంద్రపాలనగరం దాకా ముఖ్యమంత్రి పాదయాత్ర చేసే అవకాశం
సంగెం నుంచి బొల్లంపల్లి వరకూ పరిశీలన
మూసీ పునరుజ్జీవం ఆవశ్యకతపై వివరణ
ప్రాజెక్టుకు ప్రజల మద్దతు కూడగట్టే యత్నం
యాదాద్రి/హైదరాబాద్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మూసీ నది పునరుజ్జీవం విషయంలో ముందుకే వెళతామంటూ ఇటీవల స్పష్టం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ దిశగా ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్నారు. మూసీ నది కాలుష్యం కారణంగా భువనగిరి జిల్లాలోని పరీవాహక గ్రామాల ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకురానున్నారు. ఈ మేరకు బాధిత ప్రజలతో స్వయంగా మాట్లాడేందుకు ఆ ప్రాంతంలో పర్యటించనున్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలో పాదయాత్ర చేపట్టే యోచనలో ఉన్నారు. ఇందుకు తన పుట్టినరోజునే ముహూర్తంగా సీఎం ఎంచుకున్నారు. ఈ నెల 8న తన పుట్టినరోజును పురస్కరించుకుని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకోనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అభివృద్ధి పనులనూ ఆయన సమీక్షించనున్నారు. దీంతోపాటు మిషన్ భగీరథ పథకంలో భాగంగా మల్లన్నసాగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాకు 200 కోట్లతో చేపట్టనున్న తాగునీటి పైపులైన్ నిర్మాణానికి పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు.
మూసీ కాలుష్య బాధితులతో మాటా-ముచ్చట
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యటనలో మూసీ కాలుష్య బాఽధితులతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహించనున్న మాటా-ముచ్చట కార్యక్రమం ప్రత్యేకంగా నిలవనుంది. ఈ జిల్లాలో ముఖ్యంగా నాగారం నుంచి ఇంద్రపాలనగరం వరకు మూసీ నది పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలు, రైతులు మూసీ కాలుష్యంతో దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆరోగ్యం, పంటల పరంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు. వీరితోపాటు సంగెం నుంచి బొల్లంపల్లి వరకు కూడా మూసీ నది పరిసర ప్రాంతాల ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటించి.. దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న బాధలను అడిగి తెలుసుకోనున్నారు. అదే సమయంలో మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు.. వారి కష్టాలను ఎలా తీరుస్తుందన్నదీ వివరించనున్నారు. తద్వా రా మూసీ పునరుద్ధరణ ప్రాజెక్టుకు ప్రజల మద్దతును కూడగట్టనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టే అవకాశం కూడా ఉందని పేర్కొన్నాయి.
ఒకటి, రెండు రోజుల్లో ఖరారు..
వాస్తవానికి మూసీ కాలుష్యంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పరివాహక గ్రామాల ప్రజలు, రైతులు పడుతున్న ఇబ్బందులను వెలుగులోకి తేవడానికి అక్టోబరు 26న భువనగిరి ఎమ్మెల్యే కంభం అనిల్‌కుమార్‌రెడ్డి ప్రజా చైతన్యయాత్ర చేపట్టారు. ఈ క్రమంలో భవనగిరి పర్యటనకు వచ్చినప్పుడు మూసీ కాలుష్య బాధిత ప్రజలు, రైతులను కలవాల్సిందిగా సీఎం రేవంత్‌ను ఎమ్మెల్యే కోరారు. దీంతో తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రికి వస్తున్న నేపథ్యంలో అనిల్‌కుమార్‌రెడ్డి కోరిక మేరకు బాధితులను కలవాలని సీఎం నిర్ణయించారు. అయితే నాగారం నుంచి ఇంద్రపాలనగరం మధ్యలోనిగ్రామాల ప్రజలతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలా? లేక సంగెం నుంచి బొల్లంపల్లి వరకు చేపట్టాలా? అన్నదానిపై ఇంకా నిర్ణయానికి రాలేదు. ఏది ఎంచుకున్నా 6-7 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు పాదయాత్ర చేసేందుకే సీఎం ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. సీఎం యాత్ర ఎక్కడ చేపట్టాలన్నది నిర్ణయించేందుకు జిల్లా కాంగ్రెస్ నేతలు మంగళ లేదా బుధవారం భేటీ కానున్నారని, ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా.. యాదాద్రి జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హనుమంత్‌రావు, అదనపు కలెక్టర్ వీరారెడ్డి, యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్‌రావు, అధికారులు.. కొండపైన ప్రెసిడెన్షియల్ సూట్ వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అలాగే వలిగొండ మం డలంలోని సంగెం వద్ద గల మూసీ నది బ్రిడ్జినీ పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లకు సంబంధించి భువనగిరి జోన్ డీసీపీ రాజేశ్‌చంద్ర ఇంద్రపాలనగరం గ్రామాన్ని సందర్శించారు.
ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసిన సీఎంకు కృతజ్ఞతలు
కులగణనలో బీసీలంతా పాల్గొనాలి: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్/బర్కత్‌పుర, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా సమగ్ర కులగణన కోసం సర్కారు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయడంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు మార్గం సుగమమైందని బీసీ సంక్షేమ సంఘం నేత, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లోని కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్‌లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 6 నుంచి 21వ తేదీ వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర కులగణనలో బీసీలంతా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కులం పేరు చెప్పుకోవడానికి ఎవరూ మొహమాట పడొద్దని సూచించారు. ఈ నేపథ్యంలోనే.. సీఎం రేవంత్‌ను జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కృష్ణయ్య కలిశారు. ప్రత్యేక కమిషన్ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్యను రేవంత్ శాలువాతో సన్మానించారు. టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, మత్స్య కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, బీసీ సంక్షేమ సంఘం నేతలు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులు!
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ సాఫీగా జరిగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమర్థంగా అమలుచేసేందుకు ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం ప్రతి ఉమ్మడి జిల్లాకొక ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించింది. రైతులకు ధాన్యం కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించాలని, ఏవైనా సమస్యలుంటే అక్కడికక్కడే పరిష్కరించాలని, కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని సీఎం సూచించారు.
ఉమ్మడి జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు
01. ఆదిలాబాద్- కృష్ణ ఆదిత్య
02. కరీంనగర్- ఆర్‌వీ కర్ణన్
03. నల్లగొండ- అనితా రాంచంద్రన్
04. నిజామాబాద్- ఎ. శరత్
05. రంగారెడ్డి - డి. దివ్య
06. మహబూబ్‌నగర్- రవి
07. వరంగల్- వినయ్ కృష్ణారెడ్డి
08. మెదక్- దాసరి హరిచందన
09. ఖమ్మం- కె. సురేంద్రమోహన్