Share News

CM Revanth Reddy: సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు

ABN , Publish Date - Nov 16 , 2024 | 03:29 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

CM Revanth Reddy: సర్వేను అడ్డుకుంటే ఉపేక్షించొద్దు

  • ఇంటింటి కుటుంబ సర్వేపై సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

  • రాష్ట్రంలో 5.24 లక్షల ఇళ్లలో పూర్తయిన కార్యక్రమం

  • నిర్వహణ తీరుపై ముఖ్యమంత్రి సంతృప్తి

హైదరాబాద్‌, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కుల సర్వేకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించవద్దని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సర్వే జరుగుతున్న తీరును పర్యవేక్షిస్తూ.. ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని, తగిన ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటి కుటుంబ సర్వేపై శుక్రవారం సాయంత్రం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం.. దేశానికే ఆదర్శంగా ఈ సర్వేను నిర్వహించాలని, నిర్ణీత సమయానికి పూర్తిచేయాలని అధికారులతో అన్నారు. ఈ సర్వేలో సేకరిస్తున్న వివరాలు రాష్ట్ర పౌరుల అభ్యున్నతి కోసమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారంనాటికి 5,24,542 ఇళ్లలో సర్వే పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.


మొత్తం 87,807 మంది సిబ్బంది, 8,788 పర్యవేక్షక అధికారులు ఈ సర్వేలో పాల్గొంటున్నారని... ప్రజల నుంచి స్పందన కూడా బాగా ఉందని వివరించారు. 52,493 గ్రామీణ, 40,901 అర్బన్‌ ప్రాంతాలను కలిపి మొత్తం 92,901 బ్లాకులుగా విభజించి.. సర్వే నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించడానికి సీనియర్‌ ఐఏయస్‌ అధికారులను ఉమ్మడి జిల్లాలవారీగా నియమించినట్టు చెప్పారు. దీంతో సర్వే జరుగుతున్న తీరుపట్ల సీఎం రేవంత్‌ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, మునిసిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్‌, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌ సుల్తానియా తదితర అధికారులు పాల్గొన్నారని సమాచార శాఖ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. కాగా.. సిక్కు మత స్థాపకుడు గురునానక్‌ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో గురునానక్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. సీఎం వెంట ఆయన సలహాదారు వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు.

Updated Date - Nov 16 , 2024 | 03:29 AM