CM Revanth Reddy: ప్రతిభ ఆధారంగా ఎంపిక చేశాంప్రతిష్ఠ పెంచండి
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:59 AM
విశ్వ విద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి సారించాలని, విద్యార్థులను గమనించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఇటీవల నియమితులైన వైస్ చాన్సలర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
వర్సిటీలను ప్రక్షాళన చేయాల్సిందే
దెబ్బతిన్న వ్యవస్థల్ని బాగుచేయండి
పనితీరు ద్వారా మంచిపేరు తెండి
అందుకు మీకు స్వేచ్ఛ, సహకారం
డ్రగ్స్, గంజాయిపై కన్నేయండి
తప్పు చేస్తే ఆశ్చర్యకర నిర్ణయాలు
వర్సిటీల కొత్త వైస్ చాన్స్‌లర్లతో ముఖ్యమంత్రి రేవంత్
విశ్వ విద్యాలయాల్లో డ్రగ్స్, గంజాయి విక్రయాలపై దృష్టి సారించాలని, విద్యార్థులను గమనించి, వారికి కౌన్సెలింగ్ ఇవ్వాలని ఇటీవల నియమితులైన వైస్ చాన్సలర్లకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. గతంలో వైస్ చాన్సలర్లను విద్యార్థులు ఏళ్ల తరబడి గుర్తు పెట్టుకునే వాళ్లని ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదని గుర్తు చేశారు. అందుకే, యూనివర్సిటీలను వంద శాతం ప్రక్షాళన చేయాలని, వర్సిటీలపై నమ్మకం కలిగించేలా పనిజేయాలని దిశానిర్దేశం చేశారు. అన్ని యూనివర్సిటీల వీసీలు శనివారం సీఎం రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కొంత కాలంగా యూనివర్సిటీలపై నమ్మకం తగ్గుతోందని, వాటి గౌరవాన్ని పెంచాలని సూచించారు. ‘‘విశ్వ విద్యాలయ వ్యవస్థలు దెబ్బతిన్నాయి.
వాటి పునరుద్ధరణకు ఏం చేయాలో అధ్యయనం చేయండి. వర్సిటీల ప్రస్తుత పరిస్థితి పై సమగ్ర అధ్యయనం చేసి చర్యలు మొదలు పెట్టండి. అవసరమైతే కన్సల్టెన్సీలను ఏర్పాటు చేసుకొని నివేదిక తయారు చేయండి’’ అని సూచించారు. వైస్ చాన్సలర్లకి ఎవరి ప్రభావితంతోనూ పోస్టింగులు ఇవ్వలేద ని, కేవలం మెరిట్, సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేశామని గుర్తు చేశారు. బాగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. తప్పు జరిగితే ఆశ్చర్యకరమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని సున్నితంగా హెచ్చరించారు. మంచి పని చేయడానికి వారికి స్వేచ్ఛ ఉంటుందన్నారు. అందుకు ప్రభుత్వ సహకారమూ ఉంటుందన్నారు. సీఎంను కలిసిన వారిలో సలహాదారుడు నరేందర్ రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం ఉన్నారు.