Cold Wave: సిర్పూర్ @ 9.4 డిగ్రీలు
ABN , Publish Date - Nov 25 , 2024 | 03:04 AM
తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. రానున్న మూడు రోజులు కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల్లోపునకు పడిపోవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
చలి పులికి గజగజ వణుకుతున్న ఏజెన్సీ
రాష్ట్రంలో పడిపోతున్న కనిష్ఠ ఉష్ణోగ్రతలు
హైదరాబాద్/ఆసిఫాబాద్/నిజామాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదవుతుండగా.. రానున్న మూడు రోజులు కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల్లోపునకు పడిపోవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తూ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ (యూ) మండలంలో ఆదివారం రాష్ట్రంలోనే అత్యల్పంగా 9.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లా కొహిర్‌లో 9.9 డిగ్రీలు, మిగిలిన జిల్లాల్లో 10 నుంచి 15 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. ముఖ్యంగా మన్యం ప్రాంతం చలి గుప్పిట్లో చిక్కి గజగజ వణుకుతోంది. ఆసిఫాబాద్ ఏజెన్సీలో ఉదయం పది గంటలైనా బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం 12 గంటల వరకు చలిగాలులు వీస్తున్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలు కూడా మధ్యాహ్నం తర్వాతే వస్తున్నారు.
సిర్పూర్(యూ), కెరమెరి, జైనూర్, లింగాపూర్, తిర్యాణి, వాంకిడి, ఆసిఫాబాద్ మండలాల్లో చలి విశ్వరూపం చూపుతోంది. ఆదివాసీలు రోజువారి పనులకు వెళ్లేందుకు జంకుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు నెగళ్లు, చలిమంటలు కాగుతున్నారు. శీతలగాలుల తీవ్రతతో జలుబు, దగ్గు, సీజన్ వ్యాధులు ప్రబలుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో ఇస్నోఫిలియా వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్నట్లు వైద్యులు గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా బహర్‌హత్నూర్‌లో 10.1 డిగ్రీలు, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 11.1, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 11.7, కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలో 11.8, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందనవెల్లిలో 11.8, ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 11.9, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 12, జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కొల్వాయిలో 12.1, మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం మౌలాలిలో 13 డిగీల్ర కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదయ్యింది. సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తుండడం, గదులు దొరకక ఆరుబయటే ఉండడంతో చలికి ఇబ్బందులు పడుతున్నారు.
చలి తీవ్రతకు గుర్తు తెలియని వ్యక్తి మృతి
పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో చలి తీవ్రతకు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 45 ఏళ్ల వయస్కుడైన ఆ వ్యక్తి శనివారం అర్ధరాత్రి పెద్దకొత్తపల్లి బస్టా్‌పలోని బెంచీపై పడుకున్నాడు. చలి తీవ్రతతో అక్కడే ప్రాణాలు వదిలాడు. స్వెటర్ ధరించి ఉన్నాడు. పక్కన ఒక దుస్తుల సంచి ఉంది. మృతుడు బిహార్ రాష్ట్రానికి చెందినవాడని భావిస్తున్నారు.