Share News

Ponnam Prabhakar: కుల గణనకు సర్కారు కసరత్తులు

ABN , Publish Date - Oct 09 , 2024 | 03:41 AM

ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేపట్టడానికి కాంగ్రెస్‌ సర్కారు కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు కుల గణనపై షెడ్యూల్‌ ఖరారు చేయడానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది.

Ponnam Prabhakar: కుల గణనకు సర్కారు కసరత్తులు

  • అధికారులతో మంత్రి పొన్నం సమావేశం షెడ్యూల్‌, విధివిధానాల రూపకల్పనపై చర్చ

హైదరాబాద్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేపట్టడానికి కాంగ్రెస్‌ సర్కారు కసరత్తులు చేస్తోంది. ఈ మేరకు కుల గణనపై షెడ్యూల్‌ ఖరారు చేయడానికి రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం కీలక సమావేశం జరిగింది. బీసీ కమిషన్‌ చైర్మన్‌ నిరంజన్‌, కమిషన్‌ సభ్యులు, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్‌ రెడ్డితో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌లో చేసిన కుల గణనపై చర్చించారు.


కర్ణాటకలో బీసీ కమిషన్‌ చేసిన సర్వే, బిహార్‌లో జీఏడీ ద్వారా చేసిన సర్వే, ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ రాజ్‌ ద్వారా సర్వే చేసిన అంశాలపై మాట్లాడారు. ఈ మూడు రాష్ట్రాల్లో అనుసరించిన పద్ధతులను పరిశీలించి, అందులో ఉత్తమ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయించారు. ఈ కుల గణన సర్వే నివేదిక ఎస్సీ వర్గీకరణకు సైతం ఉపయోగపడుతుందనే అంశమూ చర్చకు వచ్చింది. నివేదిక పారదర్శకంగా ఉండటానికి కుల గణనను జీఏడీ లేదా పంచాయతీ రాజ్‌, రెవెన్యూ శాఖ ద్వారా చేయించే విషయంపై రెండు మూడు రోజుల్లో సీనియర్‌ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని అనుకున్నారు. కుల గణనను సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షించేలా చూడాలని అభిప్రాయపడ్డారు. కులగణన చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్‌ సెక్రటరీ లోకేశ్‌ కుమార్‌, కమిషనర్‌ అనితా రామచంద్రన్‌ తదితర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 09 , 2024 | 03:41 AM