Share News

Telangana: పేదల కోసం కాంగ్రెస్‌.. పెద్దల కోసమే బీజేపీ

ABN , Publish Date - May 29 , 2024 | 04:38 AM

దేశంలోని పేదల కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుంటే బీజేపీ కొందరు పెద్దల కోసమే పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు.

Telangana: పేదల కోసం కాంగ్రెస్‌..   పెద్దల కోసమే బీజేపీ

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): దేశంలోని పేదల కోసం కాంగ్రెస్‌ పనిచేస్తుంటే బీజేపీ కొందరు పెద్దల కోసమే పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆరోపించారు. పంజాబ్‌లోని ఫరీద్‌కోట్‌ లోక్‌సభ పరిధిలోని కొట్కపుర అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ.. మోదీ పదేళ్ల పాలనలో అదానీ అంబానీ వంటి కొద్దిమంది పెద్దలకు మాత్రం రూ.16 లక్షల కోట్ల రుణ మాఫీ చేసి, దేశాన్ని అప్పులకుప్పగా మార్చారని విమర్శించారు.

మద్దతు ధర, రుణమాఫీ కోసం ఢిల్లీలో రైతులు నెలలతరబడి ఆందోళన చేస్తే మోదీ 10 నిమిషాలు కూడా వారికోసం కేటాయించలేదని, ఆ పోరాటంలో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారన్నారు. జై జవాన్‌ జై కిసాన్‌ కాంగ్రెస్‌ నినాదమని, నెహ్రూ కాలం నుంచి మొన్నటి మన్మోహన్‌సింగ్‌ వరకు రైతు సంక్షేమమే ధ్యేయంగా పని చేశామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు.

ఇండియా కూటమి అధికారంలోకి రాగానే దేశవ్యాప్తంగా ఉచిత ఆరోగ్య భీమా పథకాన్ని అమలు చేస్తుందని తెలిపారు. అదేవిధంగా అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఈ దేశం కోసం దేహాలను ముక్కలు చేసుకున్న చరిత్ర దివంగత ప్రధానులు ఇందిరా, రాజీవ్‌ గాంధీలదని, వారి వారసత్వాన్ని యువనేత రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్నారన్నారు. జనాభా దామాషా ప్రకారం దేశసంపద, వనరులు పంపిణీ చేయడమే లక్ష్యంగా రాహుల్‌ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌వరకు పాదయాత్ర, మణిపూర్‌ నుంచి ముంబై వరకు బస్సు యాత్ర చేశారని భట్టి విక్రమార్క వెల్లడించారు.

Updated Date - May 29 , 2024 | 04:39 AM