K. Narayana: నాగార్జునకు అంత కక్కుర్తి ఎందుకు?
ABN , Publish Date - Aug 26 , 2024 | 03:24 AM
సినీ హీరో నాగార్జునేమీ సత్యహరిశ్చంద్రుడు కాదని, ఆయన ఎన్-కన్వెన్షన్ మీద రోజుకు రూ.లక్షలు సంపాదించారని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ ఆరోపించారు.
ఎన్-కన్వెన్షన్‌పై రోజుకు లక్షల సంపాదన
ఆ సొమ్మును రాబట్టి, పేదలకు ఇళ్లు కట్టాలి
సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: నారాయణ
హైడ్రా పేరుతో జనాన్ని భయపెడుతున్నారు!
మంత్రుల్లో సమన్వయ లోపం: కూనంనేని
మాదాపూర్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): సినీ హీరో నాగార్జునేమీ సత్యహరిశ్చంద్రుడు కాదని, ఆయన ఎన్-కన్వెన్షన్ మీద రోజుకు రూ.లక్షలు సంపాదించారని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ ఆరోపించారు. పేద లు గజం స్థలం ఆక్రమిస్తేనే రాద్ధాంతం చేసే అధికారులు, పాలకులు.. నాగార్జున చెరువును ఆక్రమించి భారీ నిర్మాణం చేసినా ఏళ్ల తరబడి చోద్యం చూస్తూ ఉండిపోయారని మండిపడ్డారు. తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.
ఖానామెట్‌లో హైడ్రా అధికారులు కూల్చివేసిన ఎన్-కన్వెన్షన్‌ను ఆదివారం పార్టీ నాయకులతో కలిసి నారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, కాలువలను బడాబాబులు కబ్జా చేసి భారీ నిర్మాణాలు చేపట్టారని, వీటిపై గతంలో తాము పోరాటాలు చేసినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. ‘‘ఎన్- కన్వెన్షన్ అధినేత నాగార్జున బిగ్‌బా్‌సకే బాస్ కావచ్చు.
హీరో కావచ్చు. సినిమాల్లో నటించడంతోపాటు బిగ్‌బాస్ ద్వారా ఆయనకు రూ.వందల కోట్లు వస్తాయి. నాగార్జునకు ఎందుకంత కక్కుర్తి? చెరువు ఎఫ్‌టీఎల్‌లో ఫంక్షన్ హాల్ కట్టడం ఏంటి? ఎన్-కన్వెన్షన్‌లో సంపాదించిన డబ్బును కక్కించాలి’’ అని ప్రభుత్వాన్ని కోరారు. అలాగే మాజీ మంత్రి మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెరువుల్లో కాలేజీలు కట్టారని, ఫిరంగి నాలాను కబ్జా చేసి ఇళ్లు కట్టుకున్నారని ఆరోపించారు. హైడ్రా ఆరంభ శూరత్వంగా ఉండకూడదని, ఎక్కడ కబ్జా జరిగినా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
రాజకీయ కక్ష సాధింపులు వద్దు..
ఒకే పార్టీ, ఒకే వర్గం మీద కక్ష సాధింపు మంచిది కాదని, ఎవరు ఆక్రమించినా హైడ్రా కూల్చివేతలు చేపట్టాలని నారాయణ చెప్పారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు నోటరీ భూముల్లో ఇళ్లు కట్టుకున్నారని, అలాంటి వారికి క్రమబద్ధీకరించాలి కానీ, పొట్ట కొట్టవద్దని ప్రభుత్వాన్ని కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. ఏ పార్టీ వారైనా అక్రమ నిర్మాణం చేపడితే కూల్చివేయాలని, తాము కూడా హైడ్రా కూల్చివేతలను పరిశీలిస్తామని చెప్పారు. మజ్లిస్ నేతలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలనూ నేలమట్టం చేయాలని ఆయన అన్నారు.