CPI Narayana: మూసీ ప్రక్షాళన వ్యతిరేకులు హైదరాబాద్ ద్రోహులే
ABN , Publish Date - Nov 03 , 2024 | 03:56 AM
మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్‌కు ద్రోహం చేయడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
ఒక దేశం-ఒకే ఎన్నిక దేశానికి మంచిది కాదు: నారాయణ
న్యూఢిల్లీ, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : మూసీ ప్రక్షాళనను వ్యతిరేకిస్తే హైదరాబాద్‌కు ద్రోహం చేయడమేనని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మూసీ ప్రక్షాళన అంశంపై పోటాపోటీగా పోరాటాలు చేస్తోన్న బీఆర్‌ఎస్, బీజేపీ.. ప్రజాసమస్యలను రాజకీయ స్వార్థానికి వాడుకుంటున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలోని అజోయ్ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఫిరంగి నాలా ఖాళీ చేసి మూసీ నది ప్రక్షాళన చేయాలని సీపీఐ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తోందని తెలిపారు. మూసీ నిర్వాసితులకు ప్రత్యామ్నాయం చూపే అంశంలో ప్రభుత్వంతో మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు.
జగన్ కేసుల్లో జాప్యం వల్లే షర్మిలతో పంచాయితీ
వైఎస్ జగన్ 11 ఏళ్లుగా బెయిల్‌పై బయట తిరుగుతున్నారని, ఓ వ్యక్తి ఇన్నేళ్లు బెయిల్ మీద ఉండడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. జగన్ అక్రమాస్తుల కేసు 11 ఏళ్లుగా తేలకపోవడం వల్లే జగన్, షర్మిల మధ్య ఆస్తుల పంచాయితీ వచ్చిందని తెలిపారు. జగన్ విషయంలో దర్యాప్తు సంస్థలు ఇంకెంతకాలం కాలయాపన చేస్తాయని ప్రశ్నించారు.