Bhatti Vikramarka: చెరువుల్లోని నిర్మాణాలనే ‘హైడ్రా’ కూల్చేస్తోంది..
ABN , Publish Date - Aug 25 , 2024 | 03:46 AM
చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలనే ‘హైడ్రా’ కూల్చివేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
నోటీసులు ఇచ్చిన తర్వాతే చర్యలు: భట్టి
చెరువుల్లోని నిర్మాణాలనే ‘హైడ్రా’ కూల్చేస్తోంది
న్యూఢిల్లీ/హైదరాబాద్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలనే ‘హైడ్రా’ కూల్చివేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఢిల్లీలో శనివారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం భట్టి మీడియాతో మాట్లాడారు. చట్టానికి లోబడి ప్రతి పనికి నోటీసులిచ్చిన తర్వాతనే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. హైదరాబాద్ అంటేనే లేక్స్, రాక్స్(సరస్సులు, రాళ్ల)కు నెలవని, వీటిని కాపాడుకోవాలంటూ పర్యావరణవేత్తలు గతంలో ఆందోళనలు కూడా చేశారని గుర్తుచేశారు.
చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రాను ఏర్పాటు చేశామని తెలిపారు. హైడ్రా చేపట్టిన కూల్చివేతలను ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారన్నారు. గత పదేళ్లలో చెరువులు ఎంత మేర ఆక్రమణకు గురయ్యాయన్న విషయాన్ని శాటిలైట్ ఫొటోల ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. అప్పట్లో ఎన్ని చెరువులు ఉండేవి? ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఆ భూముల్లో ఉన్న భవనాలెన్ని? అనే వివరాలను ప్రజల ముందు ఉంచుతామన్నారు. కూల్చివేతల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అనే తేడా ఉండదని తెలిపారు.