నవోదయ స్కూళ్లకు స్థలం కేటాయించండి
ABN , Publish Date - Dec 23 , 2024 | 04:42 AM
నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నవోదయ స్కూళ్ల ఏర్పాటు కోసం 20 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు.
ముఖ్యమంత్రిని కోరిన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్
ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో సీఎంను కలిసిన ఎంపీ
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో నవోదయ స్కూళ్ల ఏర్పాటు కోసం 20 ఎకరాల చొప్పున స్థలాలు కేటాయించాలని సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ కోరారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం రేవంత్ నివాసంలో ఆదివారం ఆయన్ను జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో పాటుగా ధర్మపురి అరవింద్ కలిశారు. ఇటీవల జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల్లో నవోదయ స్కూళ్లను ఏర్పాటు చేయాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిన నేపథ్యంలో సీఎం రేవంత్‌ను వారు కలిసి 2 స్కూళ్లకు చెరి 20 ఎకరాల స్థలం కేటాయించాలని కోరారు.
అదే విధంగా జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థల అన్వేషణ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు. కాగా.. నిజామాబాద్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులపైనా సీఎం రేవంత్, ధర్మపురి అరవింద్ ఈ సందర్భంగా మాట్లాడుకున్నారు. మాధవ్‌నగర్ ఆర్వోబీని కేంద్రం మంజూరు చేసిందని, నిర్మాణ వ్యయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించాల్సి ఉందన్నారు. అడివి మామిడిపల్లి ఆర్వోబీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైందని, అయితే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ ఆ నిధులను ఇతర పనులకు మళ్లించారిని వివరించారు. కంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయాలని కోరారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, తాను చేసిన విజ్ఞప్తుల పట్ల సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారని ధర్మపురి అరవింద్ ఓ ప్రకటనలో వెల్లడించారు.