Share News

Dil Raju: ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి మాట్లాడా

ABN , Publish Date - Dec 25 , 2024 | 03:54 AM

సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్‌ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై తాను సీఎంతో చర్చించానని.. ఆయన ఓకే అన్నారని,

Dil Raju: ముఖ్యమంత్రి రేవంత్‌ను కలిసి మాట్లాడా

శ్రీతేజ్‌ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై చర్చించా

సినిమా వాళ్లందరం సీఎంను కలుస్తాం: దిల్‌ రాజు

పరిశ్రమకు, సర్కారుకు వారధిలా ఉంటానని వెల్లడి

సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని స్పష్టీకరణ

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి): సంధ్య థియేటర్‌ వద్ద తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో ఉన్న శ్రీతేజ్‌ కుటుంబ బాధ్యతను తీసుకోవడంపై తాను సీఎంతో చర్చించానని.. ఆయన ఓకే అన్నారని, ఆయన ఆదేశాల మేరకు బాలుణ్ని పరామర్శించడానికి వచ్చానని ఎఫ్‌డీసీ చైర్మన్‌, ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు అన్నారు. అలాగే.. చిత్ర పరిశ్రమను ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందంటూ కొందరు మాట్లాడుతున్నారని, అందులో నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ‘‘చిత్ర పరిశ్రమకు అన్ని రకాలుగా అండగా ఉంటామని, ఎఫ్‌డీసీ ద్వారా సహాయసహకారాలు అందిస్తామని సీఎం రేవంత్‌ చెప్పారు. ప్రభుత్వానికి, పరిశ్రమకు మధ్య అనుసంధానకర్తగా ఉంటూ ఎలాంటి సమస్యలూ లేకుండా చూసుకునే బాధ్యతను ముఖ్యమంత్రి నాకు అప్పగించారు. బుధవారం లేదా గురువారం సమయం ఇస్తానన్నారు. దీనిపై పలువురు సినీ పెద్దలతో మాట్లాడాను. ఇండస్ట్రీ తరఫున అందరం వెళ్లి సీఎంను కలుస్తాం’’ అని దిల్‌ రాజు వెల్లడించారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. శ్రీతేజ్‌ కోలుకుంటున్నాడని.. అతడి ఆరోగ్యం మెరుగైనట్లు వైద్యులు చెప్పారని వెల్లడించారు.


‘వెంటిలేటర్‌ తొలగించి రెండు రోజులైందట. ఆ తర్వాత కూడా రికవరీ కనిపిస్తోంది. కాబట్టి త్వరలోనే కోలుకుంటాడు’’ అని పేర్కొన్నారు. ‘పుష్ప’ ప్రీమియర్‌ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరమని.. ఎవరూ కావాలని చేయరని ఆయన వ్యాఖ్యానించారు. తాను వేరే కార్యక్రమంలో పాల్గొనడానికి అమెరికాకు వెళ్లానని, తిరిగి రాగానే సీఎం రేవంత్‌రెడ్డిని కలిశానని చెప్పారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన రేవతి కుటుంబాన్ని సినీ పరిశ్రమ, ప్రభుత్వం కలిసి అన్ని రకాలుగా ఆదుకుంటాయని తెలిపారు. ఎఫ్‌డీసీ చైర్మన్‌గా ఆ బాధ్యతను సీఎం రేవంత్‌ రెడ్డి తనకు అప్పగించారని.. తానే ఆ పనులన్నీ చూసుకుంటానని వెల్లడించారు. ‘అల్లు అర్జున్‌ ద్వారా కూడా వారి కుటుంబానికి అందాల్సిన సాయం అందుతుంది. ఇండస్ట్రీ పెద్దగా.. అల్లు అర్జున్‌ను కూడా కలిసి ఆయన స్పందన కూడా తెలియజేస్తాను. ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ ఈ సమస్యలన్నీ త్వరలోనే సమసిపోయేందుకు కృషి చేస్తాను’ అని దిల్‌ రాజు పేర్కొన్నారు. రేవతి భర్త భాస్కర్‌కు సినీ పరిశ్రమలో ఏదో ఒక ఉద్యోగం వచ్చే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఫిలిం డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ ద్వారా కూడా ఆ కుటుంబానికి వీలైనంత సహకారం అందిస్తామన్నారు.

Updated Date - Dec 25 , 2024 | 03:55 AM