‘మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహించడమే లక్ష్యం’
ABN , Publish Date - Nov 23 , 2024 | 06:55 PM
అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తాము బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడం లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్లు ఆరుపదుల వయసులో మిస్సెస్ ఇంటర్నేషనల్ పీజెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న ..
హైదరాబాద్, నవంబర్ 23: అపరిమితమైన శక్తి సామర్థ్యాలు ఉండి కూడా తాము బలహీనులమని భావిస్తూ ఇంటికే పరిమితమవుతున్న మహిళలను అన్ని రంగాలలో ప్రోత్సహించడం లక్ష్యంగా తాను ముందుకు సాగుతున్నట్లు ఆరుపదుల వయసులో మిస్సెస్ ఇంటర్నేషనల్ పీజెంట్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విద్యావేత్త డాక్టర్ విజయ శారదా రెడ్డి అన్నారు. బ్యాంకాక్‌లో జరిగిన క్లాసిక్ మిస్సెస్ ఏషియా ఇంటర్నేషనల్ 2024 పోటీలలో పాల్గొని టైటిల్ కైవసం చేసుకున్న సందర్భంగా బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లోని చిరు గ్రామంలో జన్మించిన తనకు డిగ్రీ రెండవ సంవత్సరంలోనే వివాహం జరిగిందని అన్నారు.
భర్త ప్రోత్సాహంతో ఉన్నత విద్యను పూర్తి చేసి విద్య ద్వారానే విజ్ఞానం లభిస్తుందని బలంగా నమ్మి విద్యాసంస్థలను నెలకొల్పినట్లు చెప్పారు. అనంతరం వయస్సు కేవలం శరీరానికే.. మనసుకి కాదని ప్రతి మహిళకు వివరించే లక్ష్యంతో ఆరుపదల వయసులో అందాల పోటీలకు సిద్ధమైనట్లు చెప్పారు. భర్త, కుమారులు, కోడలు సైతం తన నిర్ణయాన్ని సమర్థించి ప్రోత్సహించడంతో అంతర్జాతీయ వేదికపై టైటిల్‌ను కైవసం చేసుకున్నట్లు చెప్పారు. ఇది కేవలం తన కోసం చేసింది కాదని చిన్న చిన్న కారణాలతో ఇంటికి పరిమితం అవుతున్న మహిళలలో అంతర్లీనంగా ఉన్న శక్తిని ప్రేరేపించే లక్ష్యంతో చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి మహిళ తనకు నచ్చిన రంగంలో అద్భుతంగా రాణించి కుటుంబానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారామె.